Homeనేషనల్Delhi: సంక్షోభంలోనూ భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

Delhi: సంక్షోభంలోనూ భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

న్యూఢిల్లీ, నవంబర్‌ 2 (తెలుగు ప్రభ): పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ భారత్‌ మాత్రం అధిక ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న 10 నుంచి 11 ఏళ్లలో దేశంలో అదనంగా దాదాపు 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కఠినమైన సవాలేనని, అయినప్పటికీ దాన్ని సాధించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

- Advertisement -

న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో సోమవారం జరిగిన ‘భారత్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ సమ్మిట్‌ అండ్‌ ఎక్స్‌పో–2026’ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో శిలాజ ఇంధనేతర విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం 300 గిగావాట్లను దాటిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్ల నుంచి పదకొండేళ్లలో మరో 500 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

గత పదేళ్లలో భారత్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోకపోయి ఉంటే, దేశంలో ఇంధన సంక్షోభం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే మరింత తీవ్రంగా ఉండేదని మోడీ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ ఇంధన రంగంలో ముందుగానే పెట్టుబడులు పెట్టి సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్‌ తన ఆర్థిక వృద్ధిని కొనసాగించగలుగుతోందని వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

భారత్‌లో రాజకీయ, విధానపరమైన స్థిరత్వం ఉందని, పునరుత్పాదక ఇంధన రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మోడీ తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఈ దశాబ్దం ముగిసే నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని వెల్లడించారు. సౌర, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్‌ ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న మూడు దేశాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వ భవనం, పాఠశాల, కళాశాల, ఆసుపత్రి, వీధి దీపాల వ్యవస్థను సౌర విద్యుత్‌తో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. దేశీయంగా విద్యుత్‌ నిల్వ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త బ్యాటరీ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో, అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు మౌలిక సదుపాయాలను కూడా విస్తరించాల్సి ఉందని చెప్పారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలోనూ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని మోడీ తెలిపారు. జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా ఈ రంగంలో పురోగతి సాధిస్తున్నామని, ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇంధన భద్రతకు స్వచ్ఛమైన విద్యుత్తే కీలకమని స్పష్టం చేశారు.

పునరుత్పాదక ఇంధన కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అంతర్రాష్ట్ర విద్యుత్‌ ప్రసార మార్గాలతో కూడిన ‘గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌’ కీలక పాత్ర పోషించనుందని ప్రధాని వివరించారు. ఈ కారిడార్‌ రెండో దశ కోసం ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 44 వేలకు పైగా ప్రభుత్వ భవనాలను సౌర విద్యుత్‌తో అనుసంధానించామని, తద్వారా ఏటా సుమారు రూ.700 కోట్ల మేర విద్యుత్‌ ఖర్చు ఆదా అవుతోందని మోడీ వెల్లడించారు.

ఇంధన రంగంలో 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: ప్రహ్లాద్‌ జోషి
న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎక్స్‌పోను కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ‘పెట్టుబడులు పెట్టండి.. ఆవిష్కరించండి.. స్ఫూర్తినివ్వండి’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తోంది. ప్రారంభోత్సవం అనంతరం మోడీ ఎక్స్‌పోలోని వివిధ స్టాళ్లను సందర్శించి, అక్కడ తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించిన ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన రంగంలో 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో శిలాజ ఇంధనేతర వనరుల ఆధారిత విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2024 సెప్టెంబర్‌లో 200 గిగావాట్లుగా ఉన్న ఈ సామర్థ్యం ప్రస్తుతం 310 గిగావాట్ల మార్కును దాటిందని పేర్కొన్నారు. ఈ రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా 6.2 బిలియన్‌ డాలర్లకు చేరాయని జోషి వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News