India’s official stance on POK protests : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనల సెగలు భగ్గుమంటున్నాయి. తమ హక్కుల కోసం, దశాబ్దాల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తుతుంటే, పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. అమాయక పౌరుల రక్తం పారుతున్న వేళ, ఈ నెత్తుటి ఘోరాలపై భారత్ తొలిసారిగా పెదవి విప్పింది. దాయాది దేశానికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ పాకిస్థాన్‌కు భారత్ ఇచ్చిన ఘాటైన సందేశం ఏమిటి? పీవోకేలో ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?
పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై, అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. పీవోకేలో జరుగుతున్న క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇస్లామాబాద్ కచ్చితంగా జవాబు చెప్పి తీరాల్సిందేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తమ సహజ వనరులను పాకిస్థాన్ దశాబ్దాలుగా దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ పీవోకే ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనలను పాక్ సైన్యం రక్తసిక్తం చేసింది. ఈ అణచివేతలో 12 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
“పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలను, అమాయక పౌరులపై పాక్ బలగాలు సాగిస్తున్న దారుణాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ఇవి పాకిస్థాన్ బలవంతపు, చట్టవిరుద్ధమైన ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతంలోని వనరులను వ్యవస్థాగతంగా దోచుకునేందుకు అవలంబిస్తున్న అణచివేతలో భాగమే. ఈ క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్థాన్ కచ్చితంగా జవాబుదారీతనం వహించాలి,” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.
అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం: పీవోకేలో దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారని ఆరోపిస్తూ “అవామీ యాక్షన్ కమిటీ” (ఏఏసీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి నిరసనలు ఉద్ధృతమయ్యాయి. 70 ఏళ్లుగా తమకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ “షటర్-డౌన్, వీల్-జామ్” పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో, పాక్ సైన్యం ఆందోళనకారులపై కాల్పులకు తెగబడింది. దీంతో 12 మంది మరణించగా, 150 మందికి పైగా గాయపడ్డారు. అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు.
తప్పును కప్పిపుచ్చుకునే యత్నం: పీవోకేలో చెలరేగిన అల్లర్లకు, పెల్లుబికిన ప్రజాగ్రహానికి తమ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని అంగీకరించలేని పాకిస్థాన్, తన తప్పును భారత్‌పై నెట్టే ప్రయత్నం చేసింది. “మన శత్రుదేశానికి (భారత్‌కు) ఉపయోగపడేలా నిరసనలకు దిగొద్దు,” అంటూ పాక్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఆందోళనకారులను కోరడం, పాక్ ప్రభుత్వ నిస్సహాయతకు, కుటిల బుద్ధికి నిదర్శనం.
పీవోకే మాదే.. మరో మాట లేదు: పీవోకే తమ దేశంలో అంతర్భాగమని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తూనే ఉంది. “కశ్మీర్ విషయంలో భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌కు అప్పగించడం మినహా మరో మార్గం లేదు. ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరుకోవడం లేదు,” అని గతంలోనే భారత్ తేల్చిచెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో, పీవోకేలో పాక్ అకృత్యాలపై భారత్ మొదటిసారి ఇంత బలంగా స్పందించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


