Gold Smuggling: గత పదేళ్లలో దేశవ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ కేసులు లెక్కలేనన్ని బయటకు వచ్చాయి. కేంద్ర ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2015 నుంచి 2025 మధ్యకాలంలో అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం 31,772.34 కిలోలుఉన్నట్లు తెలిసింది. ఈ మొత్తం పసిడి విలువను లెక్కేస్తే సుమారు రూ.32 వేల కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేస్తూ బయటకు వెల్లడించారు.
అక్రమ రవాణా విషయానికి..
బంగారం అక్రమ రవాణా విషయానికి వస్తే, 2015–16లోనే అధికారులు 2,815 కేసులు నమోదు చేసి, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాతి ఏడాది 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గింది. అయితే 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులు నమోదు కాగా, ఆ సమయంలో 3,329.46 కిలోల బంగారం సీజ్ చేశారు.
దశాబ్దంలో అత్యధిక..
2018–19లో పరిస్థితి మరింత పెరిగింది. ఆ ఏడాది కేసులు 5,092కి చేరగా, బంగారం స్వాధీనం 4,292.29 కిలోలకు చేరింది. ఇది దశాబ్దంలో అత్యధిక పరిమాణాలలో ఒకటి. 2019–20లో 4,784 కేసులు నమోదు కాగా, 3,626.85 కిలోల బంగారం అధికారుల చేతిలో పడింది.
కరోనా సమయంలో…
కరోనా సమయంలో స్మగ్లింగ్ కొంత తగ్గింది. 2020–21లో కేసులు 2,034 గా నమోదు అయ్యాయి. ఈ ఏడాది స్వాధీనం చేసిన బంగారం 1,944.39 కిలోలు మాత్రమే. 2021–22లో కేసుల సంఖ్య 2,236గా ఉండగా, బంగారం స్వాధీనం 2,172.11 కిలోలుగా నమోదైంది.
2022–23లో మరోసారి కేసులు భారీగా పెరిగాయి. ఆ ఏడాది 4,619 కేసులు నమోదై, 4,342.85 కిలోల బంగారం స్వాధీనం చేశారు అధికారులు. 2023–24లో పరిస్థితి చరిత్రలోనే అత్యధికంగా మారింది. ఆ సంవత్సరంలోనే 6,599 కేసులు నమోదు కాగా, స్వాధీనం చేసుకున్న బంగారం 4,971.68 కిలోలకు చేరింది.
తాజాగా 2024–25లో ఇప్పటివరకు 3,005 కేసులు నమోదు కాగా, బంగారం స్వాధీనం 2,600.40 కిలోలుగా నిలిచింది. అంటే, స్మగ్లింగ్ చట్రంలో మార్పులు వచ్చినా, ఈ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది.ఇప్పుడు లెక్కలు చూస్తే మొత్తం 35,888 కేసులు నమోదు కాగా, వీటిలో స్వాధీనం అయిన బంగారం 31,772.34 కిలోలు. దీని విలువ సుమారు రూ.32 వేల కోట్లు. సాధారణ పరిస్థితుల్లో పోలీసులు లేదా కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తారు. ఆ శాఖ దానిపై పరిశీలన జరిపి, లావాదేవీలు చట్టబద్ధమని తేలితే, యజమానికి తిరిగి ఇస్తుంది. అయితే గత పదేళ్లలో స్వాధీనం చేసిన ఈ బంగారాన్ని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడం గమనార్హం.


