Saturday, November 15, 2025
Homeనేషనల్India on Pak N-Programme: పాక్ 'అణు' పాపం.. ట్రంప్ మాటల తూటాతో బట్టబయలు!

India on Pak N-Programme: పాక్ ‘అణు’ పాపం.. ట్రంప్ మాటల తూటాతో బట్టబయలు!

Pakistan’s illegal nuclear proliferation :  అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంధించిన మాటల తూటాలు.. దాయాది దేశం పాకిస్థాన్ పునాదులను కదిలిస్తున్నాయి. ప్రపంచ శాంతికి పెనుముప్పుగా పరిణమించిన పాక్ రహస్య అణు కార్యక్రమాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని, పాకిస్థాన్ అక్రమ కార్యకలాపాలను భారత్ మరోసారి ప్రపంచం ముందు ఎండగట్టింది. అసలు ట్రంప్ ఏమన్నారు? పాకిస్థాన్ దశాబ్దాలుగా సాగిస్తున్న ఈ అణుకుట్ర వెనుక ఉన్న అసలు లక్ష్యం కేవలం భారత్‌ను ఎదుర్కోవడమేనా, లేక దాని వెనుక ‘ఇస్లామిక్ బాంబు’ అనే భయంకరమైన ఎజెండా దాగి ఉందా? అణు స్మగ్లర్‌గా పేరుమోసిన ఏక్యూ ఖాన్ ఈ పాపంలో పోషించిన పాత్రేంటి?

ప్రపంచ దేశాల కళ్లుగప్పి పాకిస్థాన్ రహస్యంగా అణుపరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. దొంగచాటుగా, చట్టవిరుద్ధంగా అణు కార్యకలాపాలు సాగించడంలో పాకిస్థాన్‌కు దశాబ్దాల చీకటి చరిత్ర ఉందని ధ్వజమెత్తింది.

- Advertisement -

ట్రంప్ ఆరోపణలు.. భారత్ స్పందన  : ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఉత్తర కొరియా, పాకిస్థాన్ సహా అనేక దేశాలు భూగర్భంలో రహస్యంగా అణుపరీక్షలు చేస్తున్నాయి. అందుకే మేం కూడా అణుపరీక్షలు చేయాలని నిర్ణయించాం” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

“రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణు కార్యక్రమాలను కొనసాగించడం పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది. స్మగ్లింగ్‌, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అలవాటే. ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్‌ ఎల్లప్పుడూ తీసుకెళ్తుంది,” అని జైశ్వాల్‌ స్పష్టం చేశారు. అయితే, ఎప్పటిలాగే పాకిస్థాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, తాము బాధ్యతాయుతమైన అణుశక్తి అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

కుట్రకు రూపశిల్పి.. ‘ఇస్లామిక్ బాంబు’ లక్ష్యం :  పాకిస్థాన్ అణు కార్యక్రమం కేవలం భారత్‌ను ఎదుర్కోవడానికే పరిమితం కాలేదని, దాని వెనుక ఓ ప్రమాదకరమైన మతపరమైన ఎజెండా ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన విషయాలు వెల్లడించారు. 1980లలో పాక్ రహస్య అణ్వస్త్ర కార్యకలాపాలను పర్యవేక్షించిన ఆయన, ఈ కుట్రకు సూత్రధారి, పాక్ అణు పితామహుడిగా పేరుమోసిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ (ఏక్యూ ఖాన్) అని స్పష్టం చేశారు.

“ఏక్యూ ఖాన్ సహా పాక్ సైనిక జనరళ్ల దృష్టిలో అది కేవలం పాకిస్థానీ బాంబు కాదు. అది ఇస్లామిక్ బాంబు, ముస్లిం బాంబు. ‘మన దగ్గర క్రైస్తవ బాంబు, యూదు బాంబు, హిందూ బాంబు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక ముస్లిం బాంబు కావాలి’ అని ఏక్యూ ఖాన్ ఒక సందర్భంలో అన్నారు. ఈ భావజాలంతోనే ఆయన ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా వంటి దేశాలకు అణు సాంకేతికతను అక్రమంగా అమ్మాడు,” అని బార్లో పేర్కొన్నారు.

అవిభక్త భారత్‌లో పుట్టి.. అణు స్మగ్లర్‌గా మారి : విచిత్రం ఏమిటంటే, ఈ దుష్టకార్యానికి ఒడిగట్టిన ఏక్యూ ఖాన్ 1936లో అవిభక్త భారతదేశంలోని భోపాల్‌లో జన్మించాడు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లి, అక్కడ అణు కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. ఆనాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మద్దతుతో, ప్రపంచ నియమాలను కాలరాస్తూ పాకిస్థాన్‌ను తొలి ఇస్లామిక్ అణుశక్తిగా మార్చి, చరిత్రలో ఓ అణు స్మగ్లర్‌గా నిలిచిపోయాడు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో, ఏక్యూ ఖాన్ నాటిన ఈ విష బీజాలు ఇంకా మొలకెత్తుతూనే ఉన్నాయన్న ఆందోళనలు అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad