పహల్గామ్‌లో ఉగ్రవాదు దాడి నేపథ్యంలో, ఈసారి భారత్ ఊహించని విధంగా స్పందించింది. ఇప్పటి వరకు ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా, 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ట్రిటీపై భారత్ ప్రశ్నించలేదు. కానీ తాజా పరిణామాల్లో ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టింది. భారత్ ఈ ఒప్పందాన్ని అమలు చేయడాన్ని నిలిపేసింది. ఇప్పటికే చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్ట్ గేట్లను పూర్తిగా మూసేసింది.
ఈ చర్యలతో పాకిస్తాన్‌లోని చీనాబ్ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. వ్యవసాయమే ఆర్థిక ప్రాణవాయువు అయిన పాకిస్తాన్‌కు ఇది తీవ్ర పరిణామాలదే. నీటి కొరత వల్ల వచ్చే ఖరీఫ్ సీజన్‌లో పంటల ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. ఇప్పటికే సింధు జలాల అథారిటీ 21 శాతం నీటి కొరత వచ్చే అవకాశముందని హెచ్చరించింది. ఏప్రిల్‌లోనే సింధు నీటి ప్రవాహం 43 శాతం వరకు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ముఖ్యంగా చీనాబ్ నది పాకిస్తాన్ గుండా దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ, 80 శాతం సాగునీటి అవసరాలను తీర్చే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆ నదిపై ఏర్పడిన అడ్డంకులతో వరి, మొక్కజొన్న, పప్పుదినుసులు, నూనెగింజలు, చెరకు వంటి పంటలపై ప్రతికూల ప్రభావం తలెత్తనుంది. ఇప్పటి వరకు నీటి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన భారత్, ఇప్పుడు దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులకు గట్టి సమాధానం ఇస్తూ, ఇప్పుడు నీటినే ఆయుధంగా మలచుకుంటోంది.
ఈ చర్యలు పాక్‌కు కేవలం హెచ్చరిక మాత్రమే కాదు.. భారత్ దృక్పథం మారిందనే సంకేతం కూడా. ఇకపై దేశంపై దాడులు చేస్తే… ప్రతిసారి పాత ఒప్పందాలు క్యాన్సిల్ చేసే అవకాసం ఉందని భారత్ స్పష్టం చేస్తుందని తెలిపింది.