పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” పాక్‌లో తీవ్ర భయాందోళనను కలిగించింది. ఈ మెరుపుదాడులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని ఐదు ప్రాంతాలపై దాడులు చేసిందని ఆరోపిస్తూ, ఈ చర్యలను యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు. పాక్ బలగాలు భారత దాడులకు గట్టిగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించారు. భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఈ దాడుల్లో, బహావల్పూర్‌లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం సహా తొమ్మిది ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత రక్షణ శాఖ పేర్కొంది.
పాక్ వర్గాలు ఈ దాడుల్లో 8 మంది పౌరులు మరణించారని, 38 మంది గాయపడినట్టు తెలిపాయి. భారత దాడులు పాక్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ, తమ వైమానిక దళాలు మూడు భారత యుద్ధ విమానాలను కూల్చేశాయని ప్రకటించాయి.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “ఇది దురదృష్టకరం. ఈ పరిస్థితి త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, పాక్ సైనిక సౌకర్యాలను లేదా పౌరులను టార్గెట్ చేయలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
ఈ దాడుల నేపథ్యంలో పాక్ లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. మసీదుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటనలు చేస్తోంది. భారత్ వైపు కాల్పులు ప్రారంభించి, యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. భారత ఆర్మీ కూడా సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది.
ఈ పరిణామాలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. భారత సైన్యం ఉగ్రవాదంపై గట్టి బదులు ఇచ్చిందని, దేశ భద్రతకు ఎలాంటి సవాలు వచ్చినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందని ఈ చర్యలు సూచిస్తున్నాయి.