దేశ భద్రతపై మళ్లీ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శక్తులు భారత్‌లో దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా రైల్వే వ్యవస్థ, రద్దీగా ఉండే స్టేషన్లు, నదీమార్గాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారత్‌కు ఇటీవల అప్పగించబడిన తహవూర్ హుస్సేన్ రాణా – ముంబై 26/11 ఉగ్రదాడులకు మాస్టర్‌మైండ్‌గా భావించబడే వ్యక్తి.. విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, నదీ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు రైల్వే గమ్యస్థానాలపై డ్రోన్లు, స్పష్టమైన శక్తివంతమైన ఐఈడీలను ఉపయోగించవచ్చని అంచనా వేస్తున్నారు. రైల్వే శాఖకు ప్రత్యేకంగా హెచ్చరికలు పంపిన ఇంటెలిజెన్స్ బ్యూరో, రద్దీ గల ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని సూచించింది. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, డ్రోన్లు గాలిలో కనిపించినా వెంటనే అధికారులు స్పందించాలని స్పష్టంగా పేర్కొన్నారు. కెనడా పౌరసత్వం కలిగిన పాకిస్తాన్ మూలాలున్న తహవూర్ రాణాను అమెరికా నుండి భారత్‌కు అప్పగించిన తరువాత అతడిపై విచారణ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో 12 మంది అధికారుల బృందం అతన్ని ప్రశ్నిస్తోంది. 2008లో ముంబై దాడులపై అతడి ప్రమేయం, దాడులకు సహకరించిన నెట్వర్క్, పాకిస్తాన్ అధికార యంత్రాంగంతో సంబంధాలపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది.
తాజా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, భారత్‌లో భయానక వాతావరణం సృష్టించేందుకు పాక్ మద్దతుతో పలు ఉగ్రవాద ముఠాలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తహవూర్ విచారణతో ఈ కుట్రలపై కీలక సమాచారం వెలుగు చూసే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్ర దాడి భారత దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. పాక్‌కి చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంగా దేశంలోకి ప్రవేశించి, మూడు రోజుల పాటు మారణహోమం సృష్టించారు. తాజ్ హోటల్, ఓబెరాయ్, సీఎస్‌ఎంటీ లాంటి ప్రదేశాల్లో జరగిన దాడుల్లో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భద్రతా సిబ్బంది, పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.