India Strategic Move: పెహల్గామ్, ఆపరేషన్ సిందూర్ అనంతరం, భారత్ తన అంతరిక్ష నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే ఆ వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చైనా మరియు పాకిస్థాన్ వంటి దేశాల కదలికలపై నిజసమయ(Real-time) పర్యవేక్షణ కోసం భారత్ కొత్త మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధమవుతోంది.
భద్రతా అవసరాల దృష్ట్యా దేశం మొత్తం 52 మిలిటరీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ.26,968 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో 21 శాటిలైట్లు ఇస్రో అభివృద్ధి చేస్తుండగా, మిగిలిన 31 శాటిలైట్లు మూడు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల ద్వారా తయారవనున్నాయి.
2026 నుంచి ప్రారంభం, 2029లో పూర్తి లక్ష్యం
ఈ స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ కార్యక్రమం “SBS-III” పేరిట అమలవుతుంది. ఇందులో భాగంగా తొలి ఉపగ్రహం 2026 ఏప్రిల్‌లో ప్రయోగించనుండగా, 2029 చివరికి మొత్తం శాటిలైట్లను అంతరిక్షంలో స్థాపించే ప్రణాళిక రచించారు. ఈ మిషన్‌ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ నేరుగా పర్యవేక్షించనుంది. ఇస్రో అభివృద్ధి చేసిన “స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్” (SSLV) టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదలాయించి, ఉపగ్రహాల వేగవంతమైన ప్రయోగాల్లో వాటిని భాగస్వాములుగా చేయనున్నారు. అత్యవసర సందర్భాల్లో శీఘ్రంగా ఉపగ్రహాలను నిష్క్రమణకెక్కించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ శాటిలైట్లు లో ఎర్త్ ఆర్బిట్ (LEO) మరియు జియో స్టేషనరీ ఆర్బిట్ (GEO)లపై దృష్టి సారిస్తాయి. ముఖ్యంగా శత్రుదేశాల ఆందోళనకర కదలికలు, ఉగ్రవాద స్థావరాలపై పర్యవేక్షణకు ఇవి ఉపయోగపడతాయి. చైనా యాంటీ శాటిలైట్ ఆయుధాలకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రణాళిక భారత వ్యూహాత్మక చర్యగా చెప్పవచ్చు.
ఉపగ్రహాల మద్దతుతో రియల్‌టైమ్ మిలిటరీ డేటా
ఇప్పటికే భారత మిలిటరీకు 9-11 శాటిలైట్లు మద్దతుగా ఉన్నాయి. వీటిలో ఇస్రో అభివృద్ధి చేసిన కార్టోశాట్ సిరీస్ శాటిలైట్లు, అలాగే ఇతర వాణిజ్య శాటిలైట్ల ద్వారా డేటాను సేకరిస్తున్నది. అంతర్జాతీయ సంస్థలైన మ్యాక్సర్ (అమెరికా), సెంటినెల్ (ఐరోపా) లాంటి ఆపరేటర్ల సహకారంతో కూడా చిత్రాలను అందుకుంటున్నది. ఇవి కొన్ని రోజులకు ఒకసారి డేటా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. భారత ఉపగ్రహాల పరిమితి కారణంగా ప్రస్తుతం 14 రోజులకు ఒకసారి మాత్రమే వివరాల్ని సేకరించగల సామర్థ్యం ఉంది. అయితే తాజా ప్రాజెక్టు పూర్తి అయితే, భారత్ రియల్‌టైమ్‌లో శత్రు కదలికలను పసిగట్టి తక్షణ చర్యలు తీసుకునే స్థాయికి చేరుకోనుంది.