PM Modi on Rockets: జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను ప్రస్తావిస్తూ.. ఈ రంగం యువతకు, శాస్త్రవేత్తలకు, స్టార్టప్లకు అపార అవకాశాలను అందిస్తోందని అన్నారు. గత 11 ఏళ్లలో సంస్కరణల ఫలితంగా భారత్ అంతరిక్ష పరిశోధనలో విశేషమైన పురోగతి సాధించిందని చెప్పారు.
‘ఆర్యభట్ట నుండి గగనయాన్ వరకు’ అనే థీమ్స్‌పై ప్రసంగించిన మోదీ.. పురాతన విజ్ఞానం నుంచి భవిష్యత్తును తీర్చిదిద్దే సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శిస్తోందని చెప్పారు. గతంలో నియంత్రణలు ఈ రంగాన్ని కట్టుకోవడంతో అభివృద్ధికి ఆటంకం కలిగినా.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి అవకాశాలు తెరవడంతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పు వచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా ఇప్పటికే 350కుపైగా స్టార్టప్స్ స్పేస్ టెక్నాలజీ రంగంలోకి వచ్చాయని వివరించారు.
భవిష్యత్ దిశలో ప్రైవేట్ రంగం పాత్ర మరింత కీలకమని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి సుమారు 5 రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. వచ్చే ఐదేళ్లలో దీనిని 50కి పెంచాలని పిలుపునిచ్చారు. అంటే ప్రతి వారం ఒక ప్రయోగం జరిగే స్థాయికి భారత్ చేరాలని మోదీ చెబుతున్నారు. అంతేకాక “ప్రైవేట్ రంగం ఐదేళ్లలో ఐదు యూనికార్న్ స్థాయి సంస్థలను నిర్మించగలదా?” అంటూ సవాలు విసిరారు మోదీ.
విజ్ఞాన రంగంలో కొత్త సాంకేతికతలు కూడా భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సెమీ-క్రయోజెనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి సాంకేతికతలు భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు దోహదం చేస్తాయన్నారు. అలాగే అంతరిక్ష సాంకేతికత సాధారణ ప్రజల జీవితాల్లోనూ ప్రాధాన్యతను సంతరించుకుందని వివరించారు. పంట బీమా పథకాల్లో ఉపగ్రహ శాటిలైట్ డేటా, మత్స్యకారుల కోసం ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, విపత్తు నిర్వహణ, “పీఎం గతి శక్తి” ప్రణాళికలో జియోస్పేషియల్ డేటా వినియోగం వంటి అంశాలను మోదీ ప్రస్థావించారు.
తదుపరి రోజులలో భారత్ గగనయాన్ మిషన్ను ప్రారంభించడమే కాకుండా, స్వంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే లక్ష్యంతో ముందుకు కదులుతున్నదని ప్రధాని ప్రకటించారు. ఇందులో శాస్త్రవేత్తల కృషి, యువత సృజనాత్మకత కీలకమని హైలైట్ చేశారు.
భారత్ అంతరిక్ష రంగాన్ని కేవలం ISRO లేదా ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ప్రైవేట్ రంగం, స్టార్టప్స్, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతతో కూడిన జాతీయ ఉద్యమంలా రూపొందించాలని ప్రధాని మోదీ విజన్. రాబోయే సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధన భారత్ ఆర్థిక వ్యవస్థకు, సాంకేతిక ముందడుగుకు ప్రధాన శక్తిగా మారనుందని ఆకాంక్షించారు భారత ప్రధాని.


