Economic Survey 2026 : దేశం విడిచి వెళ్లినా.. మాతృదేశంపై మమకారం చంపుకోలేదు. విదేశీ గడ్డపై మనోడి సత్తా చాటుతూనే.. సంపాదనలో సింహభాగం భారత్‌కు పంపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు ‘వెన్నుదన్ను’గా నిలుస్తున్నారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్ (విదేశాల నుంచి వచ్చే నగదు) స్వీకరిస్తున్న దేశంగా భారత్ మరోసారి తన జయకేతనం ఎగురవేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నా.. మన ఖజానాకు డాలర్ల ప్రవాహం మాత్రం తగ్గలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘ఎకనామిక్ సర్వే 2025-26’లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
డాలర్ల వర్షం.. రూ.135.4 బిలియన్ల రికార్డు : విదేశీ ద్రవ్య చెల్లింపుల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రవాస భారతీయుల నుంచి ఏకంగా 135.4 బిలియన్ డాలర్లు దేశానికి చేరనున్నట్లు ఆర్థిక సర్వే అంచనా వేసింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఈ చెల్లింపుల వాటా పెరగడం గమనార్హం. మన దేశానికి చెందిన అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులు విదేశాల్లో కీలక రంగాల్లో రాణిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది.
700 బిలియన్ డాలర్లు దాటిన నిల్వలు : భారత విదేశీ వాణిజ్యం కళకళలాడుతోంది. దేశం వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు (Forex Reserves) రికార్డు స్థాయిలో పెరిగాయి.
గణనీయమైన వృద్ధి: 2025 మార్చి నాటికి 668 బిలియన్ డాలర్లుగా ఉన్న నిల్వలు.. 2026 జనవరి 16 నాటికి 701.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న ఈ నిల్వలు దేశానికి సుమారు 11 నెలల పాటు వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సరిపోతాయి. అలాగే, మొత్తం విదేశీ అప్పులో 94 శాతాన్ని తీర్చగలిగే సత్తా మన నిల్వలకు ఉందని సర్వే స్పష్టం చేసింది.
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్.. దక్షిణాసియాలో నంబర్ వన్ : ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది.
కరెంట్ అకౌంట్ లోటు: 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కరెంట్ అకౌంట్ లోటు (CAD) జీడీపీలో 0.8 శాతానికి (15 బిలియన్ డాలర్లు) తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా మెరుగైన స్థితి. న్యూజిలాండ్, బ్రెజిల్, యూకే వంటి దేశాల కంటే భారత్ ఈ విషయంలో ముందుంది.
డిజిటల్ హవా: వియత్నాం, ఇండోనేషియాలను వెనక్కి నెట్టి దక్షిణాసియాలో అత్యధిక ఎఫ్‌డీఐలను (FDI) ఆకర్షించిన దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా 2020-24 మధ్య కాలంలో 114 బిలియన్ డాలర్ల డిజిటల్ పెట్టుబడులతో ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా రికార్డు సృష్టించింది. 2025 ఏప్రిల్-నవంబర్ మధ్య ఏకంగా 64.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
రూపాయి.. కాస్త బేజారు : అన్ని రంగాలు ఆశాజనకంగా ఉన్నా.. రూపాయి విలువ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 15 మధ్య డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.4 శాతం క్షీణించింది. ప్రస్తుతం డాలర్ విలువ 92 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, ఈ విలువ దేశీయ ఆర్థిక ప్రాథమిక అంశాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని, ప్రపంచ అస్థిరతలే ఇందుకు కారణమని సర్వే అభిప్రాయపడింది. బడ్జెట్‌కు ముందు దేశ ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ.. 1950-51 నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందించింది. రాబోయే సవాళ్లను, అవకాశాలను ఇది కళ్లకు కట్టింది.

