US-India strategic partnership : ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్-అమెరికాల మధ్య బంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవలి కాలంలో నెలకొన్న కొన్ని అపోహల మేఘాలను తొలగిస్తూ, ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక అడుగు పడింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్, ప్రధాని మోదీతో భేటీ అనంతరం చేసిన వ్యాఖ్యలు ఈ నూతనోత్సాహానికి అద్దం పడుతున్నాయి. అసలు ఈ భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి..? ట్రంప్-మోదీ స్నేహంపై రాయబారి ఏమన్నారు..?
భారత్-అమెరికా సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాలన్న ఇరుదేశాల సంకల్పానికి ప్రతిరూపంగా, అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత పర్యటన సాగుతోంది. ఆరు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, కీలక ఖనిజాలు వంటి అనేక కీలక ద్వైపాక్షిక అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయని గోర్ తెలిపారు. భారత్‌తో తమ బంధాన్ని అత్యంత విలువైనదిగా అమెరికా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మోదీతో ఫలప్రదమైన భేటీ : ప్రధాని మోదీతో సమావేశం అనంతరం సెర్గియో గోర్ మాట్లాడుతూ, “భారత్ మా అత్యంత ప్రాధాన్య మిత్ర దేశం. ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం చేపడుతున్న ఆధునిక సంస్కరణలు ప్రశంసనీయం. ఇరుదేశాల మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం,” అని ఉద్ఘాటించారు. రక్షణ సహకారం, వాణిజ్య పెట్టుబడులు, నూతన సాంకేతికతల మార్పిడి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
తన పర్యటనలో భాగంగా రాయబారి గోర్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాలతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తులు, ఇంధన సరఫరా, సాంకేతిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చలు జరిగాయి.
ట్రంప్ మిత్రుడు మోదీ : ఈ సందర్భంగా రాయబారి గోర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీని అత్యంత సన్నిహిత మిత్రుడిగా, వ్యక్తిగతంగా ఎంతో గౌరవిస్తారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ నమ్మకం, స్నేహం ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ కలిసి ఉన్న ఓ అరుదైన ఫొటోను స్మారకంగా ప్రధానికి బహూకరించారు.
రాయబారి భేటీపై ప్రధాని మోదీ స్పందన : అమెరికా రాయబారితో భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్‌తో భేటీ కావడం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన హయాంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నాను,” అని మోదీ ట్వీట్ చేశారు.
బలపడుతున్న బంధం.. భవిష్యత్తుపై భరోసా : ఇటీవలి కాలంలో వాణిజ్య విధానాలు, రక్షణ ఒప్పందాల వంటి అంశాల్లో ఇరుదేశాల మధ్య నెలకొన్న స్వల్ప భేదాభిప్రాయాల నేపథ్యంలో, ఈ ఉన్నత స్థాయి సమావేశాలు సంబంధాల్లో పునరుద్ధరణ వాతావరణాన్ని సృష్టించాయి. రాయబారి గోర్ పర్యటన మరింత సానుకూల సంకేతాలను ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన, సైబర్ భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో భవిష్యత్తులో ఇరుదేశాల భాగస్వామ్యం మరింత విస్తరించనుందని విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


