India-US bilateral trade agreement : గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నలుగుతున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక ముందడుగు పడనుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించి, గడువులోగా తొలిదశ ఒప్పందాన్ని ఖరారు చేసే లక్ష్యంతో భారత ఉన్నతస్థాయి బృందం అమెరికాకు పయనమవుతోంది. అసలు ఈ చర్చల్లో భారత్ దేనిపై ప్రధానంగా దృష్టి సారించనుంది..? యూరోపియన్ యూనియన్‌తో జరుగుతున్న చర్చల పరిస్థితేంటి..? ఈ ఒప్పందాలు భారత్‌కు ఎందుకంత కీలకం..?
భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత తొలిదశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కరించి, ఒప్పందాన్ని గడువులోగా ముగించడమే లక్ష్యంగా, భారత హై లెవెల్ వాణిజ్య ప్రతినిధి బృందం ఈ వారం వాషింగ్టన్‌కు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. “ప్రస్తుతం అమెరికాతో చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ పర్యటనతో తొలిదశ ఒప్పందాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వ అధికారి తెలిపారు.
చర్చల్లో కీలకాంశాలు ఇవే : ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వాణిజ్య చర్చల్లో ప్రధానంగా ఇరు దేశాల మార్కెట్లలోకి ఉత్పత్తులకు సులభమైన ప్రవేశం (మార్కెట్ యాక్సెస్), నియంత్రణ సంస్థల మధ్య సహకారం, ఇంధన, సాంకేతిక రంగాల్లో వాణిజ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
“భారత్ ప్రధానంగా అమెరికా నుంచి సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతల దిగుమతిని పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా, దీర్ఘకాలిక ద్రవీకృత సహజ వాయువు (LNG) దిగుమతులపై ఆసక్తి చూపుతోంది. ఇది భారత్ తన హరిత ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి, ఇంధన వనరులను వైవిధ్యపరచడానికి దోహదపడుతుంది,” అని సదరు అధికారి వివరించారు.
యూరోపియన్ యూనియన్‌తోనూ సమాంతరంగా : ఒకవైపు అమెరికాతో ఒప్పందంపై దృష్టి సారిస్తూనే, మరోవైపు యూరోపియన్ యూనియన్ (EU)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే, ఈయూతో చర్చల్లో కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (CBAM), ఉక్కు, ఆటోమొబైల్, అగ్రికల్చర్ రంగానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇంకా చివరి దశలో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి, ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మరో విడత చర్చలు అనివార్యమయ్యాయి. ఇందుకోసం ఈ నెల చివరి నాటికి భారత వాణిజ్య బృందం బ్రస్సెల్స్‌కు వెళ్లనుంది.
భారత్‌కు ఈ ఒప్పందాలు ఎందుకంత ముఖ్యం : భారత్‌కు అమెరికా, యూరోపియన్ యూనియన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా అవసరం. ఇది ప్రపంచ సరఫరా గొలుసులో (Supply Chain) మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి, భౌగోళిక రాజకీయ, వాణిజ్య అవసరాల మధ్య సమతుల్యతను సాధించడానికి కీలకం. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చర్చలు సానుకూలంగా సాగుతుండటం గమనార్హం.


