Sunday, February 8, 2026
Homeనేషనల్BORDER ALERT: సరిహద్దులో డ్రోన్ల కలకలం.. కౌంటర్-యూఏఎస్ వ్యవస్థలను మోహరించిన సైన్యం!

BORDER ALERT: సరిహద్దులో డ్రోన్ల కలకలం.. కౌంటర్-యూఏఎస్ వ్యవస్థలను మోహరించిన సైన్యం!

Indian Army counter-drone measures : నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పాకిస్థాన్ వైపు నుంచి అనుమానాస్పద డ్రోన్లు పదేపదే చక్కర్లు కొడుతుండటంతో, భారత సైన్యం అప్రమత్తమైంది. శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు, అత్యాధునిక కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను (Counter-UAS) సైన్యం తక్షణమే యాక్టివేట్ చేసింది. 

- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని పీర్ పంజాల్ లోయలో ఉన్న రాజౌరీ జిల్లాలో, నియంత్రణ రేఖ వెంబడి గత కొన్ని రోజులుగా పలుమార్లు అనుమానాస్పద డ్రోన్ల కదలికలను సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో, మంగళవారం  ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కౌంటర్-డ్రోన్ వ్యవస్థల యాక్టివేషన్: సరిహద్దు వెంబడి నిఘాను పటిష్ఠం చేసి, శత్రు డ్రోన్లను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన ‘కౌంటర్-అన్‌మ్యాన్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్’ (Counter-UAS)ను సైన్యం పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేసింది.

ఎందుకీ చర్యలు : పాకిస్థాన్, సరిహద్దుల వెంబడి డ్రోన్లను ఉపయోగించి, గత కొంతకాలంగా భారత్‌లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ డ్రోన్ల ద్వారా మన సైనిక స్థావరాలపై గూఢచర్యం చేయడం, ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడవడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. పదేపదే డ్రోన్లు కనిపించడంతో, ఉగ్రవాదుల చొరబాట్లకు లేదా ఏదైనా పెద్ద దాడికి పాక్ పన్నాగం పన్నుతోందన్న అనుమానాలతో, సైన్యం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

ఏమిటీ కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు : ఈ అత్యాధునిక వ్యవస్థలు, శత్రు డ్రోన్ల పాలిట యమపాశంలా పనిచేస్తాయి. ఇవి శత్రు డ్రోన్లను గుర్తించడం, వాటి కదలికలను పసిగట్టడం, చివరికి వాటి సిగ్నళ్లను జామ్ చేసి, నిర్వీర్యం చేయడం లేదా నేరుగా కూల్చివేయడం వంటివి చేస్తాయి. ఈ వ్యవస్థల మోహరింపుతో, మన గగనతలం మరింత సురక్షితంగా మారింది.

“సరిహద్దుల్లో ఎలాంటి దుశ్చర్యలనైనా తిప్పికొట్టేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. మన గగనతలంలోకి ప్రవేశించే ఎలాంటి అనుమానాస్పద వస్తువునైనా ఉపేక్షించేది లేదు,” అని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామంతో, రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News