పహల్గామ్‌లో అమాయకులపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడికి.. భారత సైన్యం గట్టి బదులు ఇచ్చింది. ఈ ఘాతుకానికి ప్రతిగా నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” భారత్ సాధించిన మరొక సైనిక విజయం గా నిలిచింది. 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ దాడుల తర్వాత, ఈ దాడి భారత సైనిక చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైంది. బుధవారం ఉదయం 1:28కి ఆపరేషన్ ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ సహా పాక్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై ఆధునిక సాంకేతికతతో మిసైల్ దాడులు జరిగాయి. హై ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్, డ్రోన్ల సాయంతో ఈ దాడులు సాగాయి. లక్ష్యం ఒక్కటే ఉగ్రవాద స్థావరాలు. పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఏ మాత్రం హాని కలగకుండా, కేవలం ఉగ్ర శిబిరాలే ధ్వంసమయ్యాయి.
జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంపులే ప్రధానంగా టార్గెట్ అయ్యాయి. బహవల్‌పూర్, సియాల్కోట్, రజౌరీ, మురిద్కే, గుల్పూర్, టంగ్‌ధర్, బిలాల్ వంటి ప్రాంతాల్లోని క్యాంపులు పూర్తిగా కూలిపోయినట్టు సమాచారం. ఈ కేంద్రాలన్నీ లైన్ ఆఫ్ కంట్రోల్‌కు 8 నుంచి 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి.
ఈ చర్యకు పునాది వేసినది పహల్గామ్ ఉగ్రదాడి. 26 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఆ దాడి భారత్‌ను కదిలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ దాడిని దేశ శక్తి ప్రదర్శనగా అభివర్ణించారు. పాక్ బహావల్పూర్‌లోని జైష్ ప్రధాన కేంద్రం మసూద్ అజహర్ నడిపించే ఈ సంస్థకు ఇది కీలక స్థావరం. 1999 కందహార్ హైజాక్ సమయంలో విడుదలైన మసూద్, ఇదే నగరంలో యువతను రిక్రూట్ చేసి భారత్‌పై దాడులకు పంపిస్తున్నాడు. ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడం ఆపరేషన్‌లో మైలురాయి.
ఆపరేషన్ ముగిసిన తరువాత ఇండియన్ ఆర్మీ “జస్టిస్ డెలివర్డ్” అంటూ ప్రకటన చేసింది. ఉగ్రవాదంపై భారత్ సున్నా సహన విధానాన్ని కొనసాగిస్తోందని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచ దేశాలు అమెరికా, చైనా సహా ఐక్యరాజ్య సమితి ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. శాంతిని కోరుతూ సంయమనం పాటించాలని యుఎన్ పిలుపునిచ్చింది. ఈ దాడితో పాక్‌కు గట్టి సందేశం వెళ్లింది ఇకపై ఉగ్రవాదానికి తావుండదని, ప్రతి బలిదానానికి భారత్ బదులిస్తుందని తెలిపింది.