Rajnath Singh: తాజాగా భారత్–చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులు ఎవరూ మరణించలేదని వెల్లడించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ ఘటనలో చైనా చర్యను భారత్ ధీటుగా ఎదుర్కొందని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చైనా సైన్యం (పీఎల్ఏ) చొచ్చుకొచ్చిన అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబట్టారు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో చైనాకు చెందిన సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, భారత సైనికులు వారిని ధీటుగా ఎదుర్కొని, చైనా సైన్యాన్ని వెనక్కిపంపారు. ఈ ఘటనలో మన సైనికులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. ప్రాణాలు కోల్పోలేదు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. ఈ నెల 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సె ప్రాంతంలో చైనా సైన్యం చొరబాటుకు ప్రయత్నించింది. వెంటనే మన సైన్యం సరైన రీతిలో స్పందించింది. మన సైనికులు చైనా సైన్యం ఆక్రమణను వీరోచితంగా అడ్డుకున్నారు. చైనా సైన్యాన్ని వెనక్కిపంపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు పక్షాల సైనికులు గాయపడ్డారు. అయితే, మన సైనికులు ఎవరికీ తీవ్రంగా గాయాలు కాలేదు.
మన సైన్యం సరైన సమయంలోనే స్పందించడం వల్ల ఆక్రమణను అడ్డుకోగలిగాం. తిరిగి సైన్యాన్ని వాళ్ల ప్రదేశానికి పంపగలిగాం. ఈ అంశంపై చైనా దౌత్యవేత్తతో కూడా మాట్లాడాం. నేను సభలో హామీ ఇస్తున్నా. మన సరిహద్దుల్ని రక్షించేందుకు సైన్యం సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రకటించారు.