పహల్గామ్ ఉగ్రదాడికి తీవ్ర ప్రతిస్పందనగా, భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’లో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెక్ పడింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని బహావల్పూర్ వద్ద ఉన్న కీలక ఉగ్ర స్థావరాన్ని భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్‌కు చెందిన స్థావరం నాశనం కావడంతో.. అతడి కుటుంబ సభ్యుల్లో 14 మంది మరణించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మృతుల్లో మసూద్ సోదరి, బావ మరియు మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి గట్టినట్టే ఎదుర్కొన్న మసూద్ అజహర్, ఈ ఘటన అనంతరం ఒక లేఖను విడుదల చేశాడు. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ, యుద్ధ నియమాలన్నీ మోదీ ఉల్లంఘించారని ఆరోపించాడు. తనకు భయం లేదు. తాను ఓడిపోలేదు. ఇంకా తన పోరాటం లేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు భారత్‌పై తిరిగి దాడులు చేసేందుకు తాను సిద్ధమవుతున్నానంటూ స్పష్టం చేశాడు.
మసూద్ అజహర్ విడుదల చేసిన ఈ లేఖ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారత ప్రభుత్వం మాత్రం ఈ దాడి ద్వారా ఉగ్రవాదంపై తన నిశ్శంక పోరాటాన్ని మరోసారి ప్రదర్శించిందని చెబుతోంది. దేశ భద్రత కోసం అవసరమైతే మరో దాడికైనా వెనుకాడబోమని రక్షణశాఖ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ పరిణామాలతో, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న గట్టి వైఖరికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది.