Red Fort Flag Hoisting Rope : భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగానే, ప్రతీ భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోతుంది. ఆ చారిత్రక ఘట్టాన్ని కోట్లాది మంది కళ్లార్పకుండా చూస్తారు. కానీ, ఆ జెండాను అంతెత్తుకు చేరవేసే ఆ చిన్న తాడు వెనుక ఓ పెద్ద కథ, శతాబ్దాల చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా..? ఆ తాడు ఎక్కడ తయారవుతుంది..? దాన్ని తయారుచేసేది ఎవరు..? ఆ కుటుంబానికి, దేశానికి మధ్య ఉన్న ఈ అపురూప బంధం ఏమిటి..?
ఢిల్లీ సదర్ బజార్‌లోని చారిత్రక దుకాణం : దేశ స్వాతంత్ర్య చరిత్రతో ముడిపడి ఉన్న ఆ తాడు.. ఢిల్లీలోని సదర్ బజార్, కుతుబ్ రోడ్డులో ఉన్న ‘గోర్ఖి మల్ ధన్ పత్ రాయ్ జైన్’ అనే దుకాణంలో తయారవుతుంది. 114 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థను ప్రస్తుతం ఐదో తరం వారసుడైన నరేశ్ జైన్ నిర్వహిస్తున్నారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తరతరాలుగా తాము అందిస్తున్న ఈ దేశభక్తి సేవ గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తరతరాల దేశభక్తి సేవ : “1947 నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధానమంత్రికి, 1950 నుంచి గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతికి మేమే తాళ్లను పంపిస్తున్నాం. మొదట్లో ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించేది. కానీ, 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు, మేం తొలిసారిగా ఉచితంగా తాడును అందించాలని నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి ఈ సేవను ఉచితంగానే కొనసాగిస్తున్నాం.”
– నరేశ్ జైన్, దుకాణం యజమాని
ప్రతి ఏటా ఆగస్టు 15కు పదిహేను రోజుల ముందు, ఆర్మీ అధికారులు స్వయంగా దుకాణానికి వచ్చి తాళ్లను తీసుకెళ్తారు. కార్యక్రమం పూర్తయ్యాక, ప్రభుత్వం అదే తాడును ఎంతో అందంగా ప్యాక్ చేసి, ప్రభుత్వ ముద్ర, ప్రశంసా పత్రంతో పాటు తిరిగి పంపిస్తుంది. ఇది తమ కుటుంబానికి దక్కిన అతిపెద్ద గౌరవంగా వారు భావిస్తారు.
తయారీ ఓ రహస్యం : ప్రధాని, రాష్ట్రపతి ఉపయోగించే ఈ తాడును అత్యంత ప్రత్యేక శ్రద్ధతో తయారుచేస్తామని నరేశ్ జైన్ తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆ తాడును ఏ పదార్థంతో తయారు చేస్తామనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతారు. మరే ఇతర వ్యాపారి ఈ తాడును సరఫరా చేయడానికి ప్రయత్నించినా, భద్రతా సంస్థలు అంగీకరించవని, దశాబ్దాలుగా ఇదే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఎర్రకోటకే కాకుండా, ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో సహా అనేక ప్రభుత్వ సంస్థలకు, పాఠశాలలకు కూడా వీరే తాళ్లను సరఫరా చేస్తారు.
114 ఏళ్ల వారసత్వం :ఈ దుకాణం 1911లో, ఐదవ జార్జ్ చక్రవర్తి భారతదేశానికి వచ్చినప్పుడు ప్రారంభమైంది. అప్పటి నుంచి నాణ్యమైన తాళ్లకు ఈ సంస్థ పెట్టింది పేరు. 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి తాడుపై అమ్మకం పన్నును రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం జీఎస్టీ వర్తిస్తోంది. జనపనార తాడుపై 5%, ప్లాస్టిక్ తాడుపై 12% జీఎస్టీ విధిస్తున్నారు. సైనిక అవసరాలు, రవాణా రంగం, వ్యవసాయం వంటి అనేక రంగాలకు వీరు తాళ్లను సరఫరా చేస్తూ, తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


