Indian Parliament: ఎగువ సభ అయిన రాజ్యసభలో ఈ ఏడాది భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. తాజాగా రాజ్యసభ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. ఈ ఏడాది మార్చి నుండి నవంబర్ మధ్య కాలంలో మొత్తం 73 మంది సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురి పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడే లెక్కలు మొదలుపెట్టాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి 10 మంది సభ్యులు విరమణ పొందుతుండగా, మహారాష్ట్ర నుండి ఏడుగురు, తమిళనాడు నుండి ఆరుగురు చొప్పున ఈ జాబితాలో ఉంది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల నుండి సైతం పలువురి పదవీకాలం పూర్తి కానుంది.
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు: తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురు సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఇందులో ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ బలాబలాల ప్రకారం.. ఈ నాలుగు స్థానాలు సైతం అధికార కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో కేంద్రంలోని ఎన్డీయే కూటమి బలం మరింతగా పెరుగనుంది.
Also read-Ayodhya: అయోధ్యలో నాన్-వెజ్ డెలివరీపై నిషేధం.. రామమందిరం చుట్టూ 15 కి.మీ పరిధిలో కఠిన ఆంక్షలు
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు: తెలంగాణలో ఇద్దరు సభ్యుల పదవీ కాలం పూర్తికానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కె.ఆర్. సురేష్ రెడ్డితో పాటు.. ఇటీవల ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సైతం ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న మెజారిటీని బట్టి చూస్తే.. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరగనుంది.
పలు బిల్లుల ఆమోదంపై ప్రభావం: ఈ ఏడాది పదవీ కాలం ముగుస్తున్న ఈ 73 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. గుజరాత్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాంల నుంచి ముగ్గురి చొప్పున సభ్యులు విరమణ పొందనున్నారు. తెలంగాణ, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెండేసి ఖాళీలు ఏర్పడగా, ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం వంటి చోట్ల ఒక్కో స్థానం ఖాళీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాజ్యసభలో వివిధ బిల్లుల ఆమోదంపై మరియు పార్టీల బలాబలాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

