Friday, January 16, 2026
Homeనేషనల్Indian Railways: రైలు ప్రయాణికులకు చికాకు.. అపరిశుభ్రతపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!

Indian Railways: రైలు ప్రయాణికులకు చికాకు.. అపరిశుభ్రతపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!

Train Maintenance Issues: భారతీయ రైల్వే.. సామాన్యుడి సొంత వాహనం. కానీ, ఇటీవల కాలంలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కోచ్‌లలో అపరిశుభ్రత, దుర్వాసన కొడుతున్న బెడ్ రోల్స్ ప్రయాణికులకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ రైల్వే శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ‘రైల్ మదద్’ (Rail Madad) యాప్‌లో నమోదవుతున్న ఫిర్యాదులను పరిశీలిస్తే, రైల్వే సేవలు ఏ స్థాయిలో పడిపోయాయో అర్థమవుతోంది.

- Advertisement -

ఒక్కసారిగా పెరిగిన ఫిర్యాదుల జోరు
గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్, నవంబర్ మాసాల్లో కోచ్‌ల శుభ్రత, బెడ్ రోల్స్ నాణ్యతపై ఫిర్యాదులు ఏకంగా 50 శాతం పెరగడం గమనార్హం. సెప్టెంబర్‌లో బెడ్ రోల్స్‌పై 8,758 ఫిర్యాదులు రాగా, అక్టోబర్‌లో అవి 13,406కి, నవంబర్‌లో 13,196కి చేరాయి. మురికిగా ఉన్న దుప్పట్లు, చిరిగిన పిల్లో కవర్లపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌ల శుభ్రతపై సెప్టెంబర్‌లో 24,758 ఫిర్యాదులు అందగా, నవంబర్ నాటికి ఆ సంఖ్య ఏకంగా 36,673కి పెరిగింది. మరోవైపు, ప్రతి ఏటా వచ్చే ‘అద్భుతం’, ‘సంతృప్తికరం’ అనే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇది భారతీయ రైల్వే ప్రతిష్టకు పెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు.

Also Read:Cigarette : – Telugu Prabha Telugu Daily పొగబాబులకు మరో షాక్

కారణాలేంటి? ఎక్కడ లోపం జరుగుతోంది?
సాధారణంగా పండుగల సీజన్ (దసరా, దీపావళి) కారణంగా అక్టోబర్, నవంబర్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని తట్టుకునే స్థాయిలో హౌస్‌కీపింగ్ సిబ్బంది లేకపోవడం, రైళ్ల నిర్వహణకు తక్కువ సమయం కేటాయించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అలాగే, ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్ల కోచ్‌లలో బొద్దింకలు, ఎలుకల బెడద కూడా పెరుగుతోంది.

రైల్వే శాఖ మేల్కొలుపు.. జోన్లకు ఆదేశాలు
పెరుగుతున్న ఫిర్యాదులపై రైల్వే బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్లకు లేఖలు రాసింది. కేవలం ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా, ఫిర్యాదు రాకుండా చూసే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది. ముఖ్యంగా వాషింగ్ లైన్ల ఆధునీకరణ, రైలు బయలుదేరే ముందే కోచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించడం. ప్రయాణంలో ఉన్నప్పుడు క్లీనింగ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం. బెడ్ రోల్స్ నాణ్యతను పెంచడానికి ఆధునిక యంత్రాల వినియోగం వంటి వాటిని మెరుగుపరచనుంది.

కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చే రైల్వే, కేవలం వేగం మీదే కాకుండా ‘పరిశుభ్రత’పై కూడా అంతే వేగంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులు చెల్లించే ధరకు తగ్గ నాణ్యమైన సేవలు అందించినప్పుడే ‘సుఖమయ ప్రయాణం’ అనే మాట నిజమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News