Railway new ticket confirmation system : రైలు ప్రయాణం… టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఆ టెన్షనే వేరు! ప్రయాణం రోజు వరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. కానీ, ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఓ సరికొత్త విధానం ప్రయాణికుల తలరాతను మార్చేస్తోంది. ఏకంగా 75% వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఖరారు అవుతున్నాయి. ఇంతటి మార్పుకు కారణమైన ఆ కొత్త వ్యవస్థ ఏంటి..? దానివల్ల ప్రయాణికులకు ఇంకెలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి..?
వెయిటింగ్ లిస్ట్ బెంగకు రైల్వే చెక్ : భారతీయ రైల్వే శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని వ్యవస్థాగత మార్పులు ప్రయాణికులకు, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ (WL) టికెట్లు తీసుకున్నవారికి భారీ ఊరటను కలిగిస్తున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా ఇప్పుడు 70 నుంచి 75 శాతం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఖరారు అవుతుండటం గమనార్హం.
కొత్త విధానం పనిచేసేదిలా..
పరిమిత వెయిటింగ్ లిస్ట్: రైల్వే శాఖ ఇప్పుడు ఒక రైలులోని మొత్తం సీట్లలో కేవలం 25 శాతానికి మాత్రమే వెయిటింగ్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తోంది. గతంలోలాగా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ ఉండకుండా, ఒక పరిమితి విధించడం వల్ల టికెట్ల నిర్ధారణ అవకాశాలు గణనీయంగా పెరిగాయి.
పారదర్శకత, ప్రణాళిక: ఈ పద్ధతి వల్ల సీట్ల లభ్యతలో పారదర్శకత పెరిగింది. ప్రయాణికులు చివరి నిమిషంలో తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం లేదా అధిక ధరలకు తత్కాల్ టిక్కెట్లు కొనాల్సిన అవసరం తగ్గింది. ముఖ్యంగా పండుగలు, సెలవులు, అత్యవసర సమయాల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూరుస్తోంది.
8 గంటల ముందే చార్ట్: ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి తమ టికెట్ స్టేటస్‌పై ముందుగానే స్పష్టత వస్తుంది.
చార్ట్ తర్వాత కూడా బెర్త్ ఖాళీ ఉండదు : రైల్వే ప్రవేశపెట్టిన మరో కీలక మార్పు ఏమిటంటే, చార్ట్ సిద్ధమైన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ సీటు వృథా కాదు. వెంటనే ఆ సీటును RAC (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) జాబితాలో ఉన్న ప్రయాణికుడికి కేటాయిస్తారు. కోచ్‌లో RAC ప్రయాణికులు ఎవరూ లేకపోతే, ఆ సీటును ‘కరెంట్ బుకింగ్’ కోసం అందుబాటులోకి తెస్తారు. దీని ద్వారా రైలు బయలుదేరిన తర్వాత కూడా మధ్యంతర స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు రైల్వే యాప్ లేదా టికెట్ కౌంటర్ల ద్వారా ఆ సీటును బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త వ్యూహంతో ప్రయాణికులలో రైల్వే వ్యవస్థపై నమ్మకం పెరిగిందని, రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తామని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.


