Saturday, November 15, 2025
Homeనేషనల్PASSENGER RIGHTS: రైలు ప్రయాణమా? ఈ హక్కులు మీకోసమే! సమస్య వస్తే సైలెంట్‌గా ఉండొద్దు!

PASSENGER RIGHTS: రైలు ప్రయాణమా? ఈ హక్కులు మీకోసమే! సమస్య వస్తే సైలెంట్‌గా ఉండొద్దు!

Indian Railways passenger rights : దేశంలో రోజుకు కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కానీ, వారిలో ఎంతమందికి తమ హక్కులపై అవగాహన ఉంది? ప్రయాణంలో ఏసీ పనిచేయకపోయినా, ఆహారం బాగాలేకపోయినా, తోటి ప్రయాణికులు ఇబ్బంది పెట్టినా, చాలామంది మౌనంగా భరిస్తుంటారు. కానీ, ఓ ప్రయాణికుడిగా మీకు కొన్ని చట్టపరమైన హక్కులున్నాయని, వాటిని ఉపయోగించుకుని మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చని మీకు తెలుసా? భారతీయ రైల్వే కల్పిస్తున్న ఆ హక్కులేంటో తెలుసుకుందాం.

- Advertisement -

మీ ప్రయాణం.. మీ హక్కు : రైలు ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం, ఓ ఫిర్యాదు మార్గం ఉంది.
టీటీఈ అనుచితంగా ప్రవర్తిస్తే..
నిబంధన: రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులతో టీటీఈతో సహా ఏ రైల్వే అధికారీ అనుచితంగా ప్రవర్తించకూడదు. సరైన కారణం లేకుండా మిమ్మల్ని కోచ్ నుంచి బయటకు పంపే అధికారం టీటీఈకి లేదు.

మీ హక్కు: ఇలాంటి సందర్భాల్లో, మీరు వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసిగానీ, ‘రైల్ మదద్’ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చు.

సౌకర్యాలు సరిగా లేకపోతే :
నిబంధన: విరిగిన సీట్లు, మురికిగా ఉన్న కోచ్‌లు, దుప్పట్లు, పనిచేయని ఏసీ, ఛార్జింగ్ పాయింట్లు వంటి సమస్యలపై ఫిర్యాదు చేసే హక్కు మీకుంది.

మీ హక్కు: ఈ సమస్యలను టీటీఈ దృష్టికి తీసుకెళ్లవచ్చు. లేదా, నేరుగా 139కి కాల్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

తోటి ప్రయాణికుల వల్ల ఇబ్బంది కలిగితే..

నిబంధన: రైలులో మద్యం, సిగరెట్లు తాగడం, పెద్దగా శబ్దాలు చేయడం, దుర్భాషలాడటం వంటివి చట్టరీత్యా నేరం.

మీ హక్కు: ఇలాంటివి మీ దృష్టికి వస్తే, భరించాల్సిన అవసరం లేదు. వెంటనే 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మీ ఫిర్యాదు రికార్డవుతుంది కాబట్టి, అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారు.

రాత్రి 10 తర్వాత టికెట్ తనిఖీ చేయకూడదు :
నిబంధన: ప్రయాణికుల నిద్రకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో, రైల్వే శాఖ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య టికెట్లను తనిఖీ చేయడాన్ని నిషేధించింది.

మీ హక్కు: ఈ సమయంలో టీటీఈ మిమ్మల్ని నిద్రలేపి టికెట్ అడిగితే, మీరు అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. (అయితే, రాత్రి 10 తర్వాత రైలు ఎక్కిన వారికి ఈ నిబంధన వర్తించదు).

అనారోగ్య సమస్య తలెత్తితే..

నిబంధన: ప్రయాణంలో మీకు అనారోగ్యంగా అనిపిస్తే, వైద్య సహాయం పొందే హక్కు మీకుంది.

మీ హక్కు: వెంటనే టీటీఈని సంప్రదిస్తే, తదుపరి స్టేషన్‌లో వైద్యుడిని ఏర్పాటు చేస్తారు. అవసరమైతే, తక్కువ ఖర్చుతోనే చికిత్స అందించేలా చూస్తారు. మీ హక్కులను తెలుసుకోండి, మీ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad