భారతదేశంలో రైలు(Indian Railways) ప్రయాణాన్ని ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు రైలులో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. ఇక సామాన్యులకైతే రైలు ప్రయాణం తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు తక్కువ టికెట్ ధరలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ప్రయాణికులపై రైల్వే సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా క్యాటరింగ్ సిబ్బంది ఓ ప్రయాణికుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌లో విశాల్ శర్మ అనే యూట్యూబర్ ప్రయాణం చేస్తుండగా క్యాటరింగ్ సిబ్బంది అధిక చార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో తమపై ఫిర్యాదు చేస్తావా? అంటూ ప్రయాణికుడిపై ప్యాంట్రీ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో ప్రయాణికుడి రక్తం వచ్చేలా గాయాలయ్యాయి. ఈ దాడిని రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ధరల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ నెటిజన్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు క్యాటరర్‌పై రూ. 5లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. అంతేకాకుండా దాడి చేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.