Gutka Cleaning Cost: భారతీయ రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటి భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న అతిపెద్ద, అత్యంత ఖరీదైన సమస్య గుట్కా మరకలు. ఈ మరకలను శుభ్రం చేయడానికి ఏటా దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ మొత్తం కొత్తగా పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయడానికి అయ్యే ఖర్చుతో సమానం కావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఖర్చు విషయం పక్కన పెడితే ఇది దేశంలోని పౌర స్పృహ, ప్రజారోగ్యం, బాధ్యతాయుత ప్రవర్తన వంటి లోతైన అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
వక్కపొడితో ఇతర రుచులతో కలిపిన పొగాకు ఉత్పత్తే గుట్కా. దీనిని భారతదేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్నారు. దురదృష్టవశాత్తు, చాలా మంది గుట్కా వినియోగదారులు ఆ ఎర్రటి వ్యర్థాన్ని రైల్వే ప్లాట్‌ఫారాలు, రైళ్లు, స్టేషన్ల ఆవరణలో ఇష్టానుసారం ఉమ్మివేస్తుంటారు. ఈ మరకలు కాలక్రమేణా మొండిగా మారి, అపరిశుభ్రంగా, అసహ్యంగా తయారవుతున్నాయి. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను ఎన్ని అమలు చేసినా.. ఎప్పటికప్పుడు నిర్వహించే శుభ్రతా డ్రైవ్‌లు చేపట్టినా, ప్రయాణికుల్లో ప్రవర్తనా మార్పు లేకపోవడం వల్ల సమస్య కొనసాగుతూనే ఉంది. వర్షాకాలంలో ఈ ఉమ్ము నీటితో కలియటం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోంది.
అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బు.. శుభ్రతకే!
ఏటా గుట్కా మరకలు శుభ్రం చేయడానికి ఖర్చవుతున్న రూ.1,200 కోట్లు అనేది చిన్న మొత్తం కాదు. ఈ డబ్బును రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రయాణీకుల సౌకర్యాలు లేదా భద్రతా ప్రమాణాల అప్‌గ్రేడ్‌ల కోసం ఉపయోగించవచ్చు. రైల్వే ఈ మరకలను సులభంగా శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతులు, యంత్రాలను వినియోగిస్తోంది. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం ప్రజల భాగస్వామ్యం, ప్రవర్తనా మార్పు ద్వారానే సాధ్యం. పైగా గుట్కా మరకలు ప్రభుత్వ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం, పౌర బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ఇదే వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించరని చాలా మంది వాదిస్తున్నారు. సొంత దేశంలోని ప్రజా ఆస్తుల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. దీనిని ఒక వేకప్ కాల్ కింద పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది.


