Saturday, November 15, 2025
Homeనేషనల్e-Visa : ఈ-వీసాల జోరు.. విదేశీ యానంలో భారతీయుల కొత్త పరుగు!

e-Visa : ఈ-వీసాల జోరు.. విదేశీ యానంలో భారతీయుల కొత్త పరుగు!

Indian travel e-Visa surge : గంటల తరబడి క్యూ లైన్లకు, రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి! విదేశీ ప్రయాణాలంటే వీసా చిక్కులతో తలలు పట్టుకునే రోజులు పోయాయి. భారతీయ ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. క్లిక్ చేస్తే చాలు, వీసా అరచేతిలో వాలిపోయే ‘ఈ-వీసా’ మంత్రం పఠిస్తున్నారు.

- Advertisement -

2025లో భారతీయులు సమర్పించిన ప్రతి 100 వీసా దరఖాస్తుల్లో ఏకంగా 82 ఈ-వీసాలే ఉండటం ఈ డిజిటల్ విప్లవానికి అద్దం పడుతోంది. ఇంతకీ భారతీయులు ఈ-వీసాలపై ఎందుకింతగా మనసు పారేసుకుంటున్నారు..? ఏయే దేశాలు వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి..? ఈ నయా ట్రెండ్ ప్రయాణ రంగంలో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతోంది..?

గణాంకాలు చెబుతున్న వాస్తవం : ప్రముఖ వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ ‘అట్లిస్’ బుధవారం విడుదల చేసిన నివేదిక భారతీయ ప్రయాణికుల మారుతున్న ప్రాధాన్యతలను కళ్లకు కట్టింది.
82% వాటా: 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం వీసా దరఖాస్తుల్లో 82 శాతం ఈ-వీసాలే ఉన్నాయి.

గణనీయమైన పెరుగుదల: 2024లో ఈ-వీసాల వాటా 79 శాతంగా ఉండగా, కేవలం ఏడాదిలోనే 3 శాతం పెరుగుదల కనిపించడం గమనార్హం.

విధానాల సరళీకరణ: భారత్ నుంచి పర్యాటకుల రాకను పెంచుకునేందుకు అనేక దేశాలు తమ వీసా విధానాలను సులభతరం చేయడమే ఈ మార్పునకు ప్రధాన కారణమని నివేదిక తేల్చిచెప్పింది.

వేగం.. కచ్చితత్వానికే ఓటు : ఈ మార్పుపై ‘అట్లిస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహక్ నహతా మాట్లాడుతూ, “భారతీయ ప్రయాణికులు ఇప్పుడు సమయానికి అత్యధిక విలువ ఇస్తున్నారు. వేగం, కచ్చితత్వం కోరుకుంటున్నారు. ఈ-వీసాలు ఈ రెండింటినీ అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో త్వరితగతిన అనుమతులు రావడంతో చివరి నిమిషంలో చేసే ప్రయాణాలు సైతం సులభతరమయ్యాయి,” అని విశ్లేషించారు. డిజిటల్ వీసా విధానాలను అవలంబించిన దేశాలు ఇప్పటికే ఫలితాలు చూస్తున్నాయని, భారత్ నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

భారతీయులకు హాట్ ఫేవరెట్ దేశాలివే : ఈ-వీసా సౌకర్యం కల్పిస్తున్న దేశాల్లో కొన్ని భారతీయులకు హాట్ ఫేవరెట్ గమ్యస్థానాలుగా మారాయి.

అగ్రస్థానంలో ఉన్నవి: యూఏఈ, వియత్నాం, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, ఈజిప్ట్ దేశాలు భారతీయులను అధికంగా ఆకర్షిస్తున్నాయి.

శ్రీలంకకు పోటెత్తిన డిమాండ్: శ్రీలంక విషయంలో ఈ-వీసా ప్రభావం అద్భుతాలు సృష్టించింది. 2024తో పోలిస్తే 2025లో వీసా దరఖాస్తులు ఏకంగా ఏడు రెట్లు పెరిగాయి.

కొత్త గమ్యస్థానాలపై మోజు: సంప్రదాయ పర్యాటక ప్రాంతాలనే కాకుండా, జార్జియా వంటి కొత్త దేశాల వైపు కూడా భారతీయులు చూస్తున్నారు. ఆ దేశానికి వీసా దరఖాస్తులు 2.6 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.

విరివిగా అవకాశాలు.. 50కి పైగా దేశాలు : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు భారతీయులకు ఈ-వీసాలు లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్లు (ఈటీఏ) అందిస్తున్నాయి. ఆసియాలో శ్రీలంక, వియత్నాం, జపాన్, సింగపూర్ ముందు వరుసలో ఉండగా, ఆఫ్రికా నుంచి ఈజిప్ట్, కెన్యా, టాంజానియా, ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మార్పుల ఫలితంగా అంతర్జాతీయ ప్రయాణాలు గతంలో కంటే ఇప్పుడు మరింత సులభతరం, సౌకర్యవంతంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad