Thursday, July 17, 2025
Homeనేషనల్India's Border Security : ఒకే సరిహద్దు.. ముగ్గురు శత్రువులు!

India’s Border Security : ఒకే సరిహద్దు.. ముగ్గురు శత్రువులు!

India’s Border Challenges and Geopolitical Dynamics: సరిహద్దులో నిత్యం అప్రమత్తంగా ఉండే భారత సైన్యానికి ఎదురుగా కనిపించే శత్రువు పాకిస్థాన్ మాత్రమే కాదు… దాని వెనుక నుంచీ, పక్కనుంచీ ప్రమాదాలు పొంచి ఉన్నాయా..? భారత్‌కు ఒకే సరిహద్దులో ఏకంగా ముగ్గురు విరోధులు ఉన్నారని, అందులో ఒక దేశం ఇంకో దేశాన్ని తన ఆయుధాలకు ‘జీవ ల్యాబ్’ (Live Lab) గా వాడుకుంటోందని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సంచలన ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి..? 

- Advertisement -

భారత్‌కు త్రిముఖ ముప్పు – చైనా, టర్కీల తెరచాటు యుద్ధం : న్యూదిల్లీలో జరిగిన ‘న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్’ సదస్సులో లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను స్పష్టం చేశాయి. “సరిహద్దులో పాకిస్థాన్ కనిపిస్తున్నా, దాని వెనుక చైనా ఉంది. అంతేకాకుండా, ఇటీవలి సైనిక ఘర్షణల్లో టర్కీ నుంచి కూడా పాక్‌కు కీలక సైనిక సహాయం అందింది” అని ఆయన వెల్లడించారు. పరోక్షంగా ఇది భారత్ కేవలం పాకిస్థాన్‌తోనే కాకుండా, చైనా, టర్కీల సంయుక్త వ్యూహాలతో పోరాడాల్సి వస్తోందన్నారు.

పాక్‌ను ‘లైవ్ ల్యాబ్’గా వాడుకుంటున్న చైనా :  రాహుల్ ఆర్.సింగ్ ప్రకారం, పాకిస్థాన్ వినియోగిస్తున్న సైనిక ఉత్పత్తుల్లో 81 శాతం చైనావే. భారత్‌తో సైనిక ఘర్షణ జరిగినప్పుడల్లా పాక్‌కు చైనా నుంచి సాయం, సైనిక టెక్నాలజీ అందుతోందని ఆయన ఉద్ఘాటించారు. అంతకుమించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, చైనా తయారు చేస్తున్న కొత్త ఆయుధాలు, నిఘా వ్యవస్థలకు ‘లైవ్ ల్యాబ్’లాగా పాక్ మారిందని ఆయన పేర్కొన్నారు. “తమ ఆయుధాలను పాక్ గడ్డపై చైనా టెస్ట్ చేయిస్తోంది” అని ఆయన వివరించారు. భారత్‌కు వ్యతిరేకంగా చైనా తన సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి పాక్‌ను ఒక వేదికగా వాడుకుంటున్నట్లు ఇది సూచిస్తుంది.

ఆపరేషన్ సిందూర్: యుద్ధ విరమణకు ‘మాస్టర్ స్ట్రోక్’ : ‘ఆపరేషన్ సిందూర్’ సంఘటనలను ప్రస్తావిస్తూ, భారత్-పాక్ డీజీఎంఓలు చర్చలు జరుపుతుంటే, భారత్ క్షిపణులు ప్రయోగిస్తున్న లొకేషన్ల సమాచారం చైనా నుంచి పాక్‌కు చేరిందని రాహుల్ ఆర్.సింగ్ గుర్తుచేశారు. అయితే, “యుద్ధాన్ని మొదలుపెట్టడం సులభమే, కానీ దాన్ని కంట్రోల్ చేయడం కష్టం” అని వ్యాఖ్యానించారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు డీజీఎంఓల స్థాయి చర్చలు ఒక ‘మాస్టర్ స్ట్రోక్‌లా’ పనిచేశాయని తెలిపారు.

కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రదాడులు జరిగితే భారత్ ఓర్చుకునేదని, ఇప్పుడు ఎప్పటికప్పుడు బలమైన సమాధానాన్ని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ అత్యంత కచ్చితత్వంతో దాడి చేసిందని, మొత్తం 21 శత్రు టార్గెట్లలో 9 టార్గెట్లను ఎంపిక చేసి దాడులు మొదలుపెట్టారని వివరించారు.

గగనతల రక్షణ వ్యవస్థల పెంపు అవసరం: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ, భారత్‌లో మరింత విస్తారంగా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. “ఈసారి ఆపరేషన్ సిందూర్ వేళ భారీ జనాభా ఉండే ప్రాంతాల్లో గగనతల రక్షణ వ్యవస్థలను అంతగా మోహరించలేకపోయాం. మరోసారి ఇలాంటి అంశంలో మనం సన్నద్ధంగా ఉండాలి” అని ఆయన సూచించారు.

ఆపరేషన్ సిందూర్: కీలక వివరాలు : ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ టూరిస్టులు మరణించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాక్, పీఓకేలలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడులలో జైషే మహ్మద్, లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ భారత్ యొక్క ‘న్యూ ఇండియా’ వైఖరిని స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News