Vande Bharat sleeper Train: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దీపావళి నాటికి ప్రారంభం కానుందని పేర్కొంది. ఢిల్లీ, బీహార్ మధ్య గల భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుందని తెలిపింది. దీంతో ఢిల్లీ-పాట్నా రూట్‌లో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది. సుమారుగా 13-17 గంటల నుంచి కేవలం 11.30కు ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో నడపడం ద్వారా సుదూర ప్రయాణ సమయాన్ని సగానికి పైగా తగ్గనుంది.
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు: ప్రస్తుతం ఢిల్లీ-పాట్నా రూట్‌లో నడుస్తున్న రాజధాని, ఇతర రైళ్లు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారుగా 13 నుండి 17 గంటల తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు సాంకేతిక లోపాలు లేదా ఇతర కారణాల వల్ల ఈ సమయం మరింతగా పెరుగుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ సమయం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం గంటకు సుమారు 180 కి.మీ. అంటే ఇది ఇతర రైళ్ల కంటే వేగంగా తన ప్రయాణాన్ని పూర్తి చేయగలదు. దీపావళికి ముందు దీనిని ట్రాక్‌పై ఉంచుతామని ఇండియన్ రైల్వే పేర్కొంది. దీంతో ఢిల్లీ నుంచి పూర్వాంచల్, బీహార్‌కు వెళ్లే ప్రయాణికు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/pro-pakistan-slogans-raised-in-karnataka/
బీఈఎమ్ఎల్ ఆధ్వర్యంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్: వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎమ్ఎల్) తయారు చేసింది. బీఈఎమ్ఎల్ దీనిని భారతీయ రైల్వేల ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసింది. సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ సమాచార స్క్రీన్‌లు, సెన్సార్ గేట్లు లాంటి ఆధునిక భద్రత, సౌకర్యాలు ఈ రైలులో ఉంటాయి. దీని లోపలి భాగం విమానాన్ని తలపించేలా ఉంటుంది. దీంతో ప్రయాణీకులకు విమానంలో ప్రయాణించే అనుభూతి లభిస్తుంది.
టికెట్ ఖరీదు ఎంతంటే..?: ప్రయాణీకులకు విమానంలో ప్రయాణించే అనుభూతితో టికెట్‌కు వెచ్చించే ధర సైతం అలానే ఉండనుంది. ఈ రైలు రాజధాని కంటే సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ సమయం, మెరుగైన సౌకర్యాల కారణంగా రైలు టికెట్ ధర ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి రాజధాని రైలు కంటే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర సుమారుగా 10 నుండి 15శాతం ఎక్కువగా ఉండనుంది.


