IndiGO Travel Voucher: విమాన ప్రయాణాల్లో తీవ్ర అంతరాయాలు సంభవించిన నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన కస్టమర్లకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను ప్రకటించింది. షెడ్యూల్‌కి 24 గంటల్లోపు విమానాలు రద్దయిన ప్రయాణీకులకు అందించే పరిహారానికి ఇది అదనమని తెలిపింది. కాగా, రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇప్పటికే చాలావరకు రీఫండ్‌లు అందించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/non-bailable-warrant-issued-against-minister-konda-surekha/
పైలట్ల కొరత, ఇతరత్రా కారణాలతో రోజుల తరబడి విమాన సర్వీసులు అంతరాయాలకు గురైన తర్వాత ఇండిగో తన కార్యకలాపాలను నెమ్మదిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో సంక్షోభ సమయంలో ముఖ్యంగా డిసెంబర్ 3- 5 తేదీల మధ్య ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఆ తేదీల్లో ప్రభావితం అయిన ప్రయాణికులకు రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ వోచర్లను రానున్న 12 నెలల్లో ఇండిగో విమానాల్లో వాడుకోవచ్చని సంస్థ తెలిపింది. అంతేకాకుండా విమానం బయలుదేరే సమయం నుంచి 24 గంటలలోపు రద్దయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందించాల్సిన పరిహారానికి ఇది అదనమని తెలిపింది. ఈ పరిహారం రూ. 5,000 నుంచి రూ. 10,000 మధ్య ఉండొచ్చు.
కాగా, ఇండిగో తన కార్యాకలాపాలను బలోపేతం చేస్తోందని.. సర్వీసుల పునరుద్ధరణ రోజురోజుకీ మెరుగవుతోందని సంస్థ వెల్లడించింది. వాతావరణం, సాంకేతికత, నియంత్రణలోని కొన్ని కారణాల వల్లనే స్వల్పంగా సర్వీసులు రద్దు అవుతున్నాయని తెలిపింది. అయితే కేంద్రం సైతం ఈ విషయాన్ని సీరియస్ తీసుకోవడంతో దీనిపై దర్యాప్తు కమిటీ విచారణ జరుపుతోంది.

