Indigo crisis shakes Rajya Sabha Union Minister Rammohan Naidu makes key comments: ఇండిగో విమానాల రద్దు అంశం దేశవ్యాప్తంగా రచ్చ రేపుతోంది. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేస్తోంది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానాల రద్దు అంశంపై కీలక ప్రకటన చేశారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించే ముందు ఇండిగోతో సహా అన్ని ఎయిర్‌లైన్ సంస్థలతో చెర్చించినట్లు ఆయన తెలిపారు. నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి తెచ్చామని, ఎఫ్టీటీఎల్ అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయన్నారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందన్నారు. ముమ్మాటికీ ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు.
5,86,700 టికెట్లు రద్దు, రీఫండ్ సెటిల్..
పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే ఇండిగో విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థల రాకను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇండిగో తప్పదం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు. ఇండిగో సంక్షోభం వల్ల మొత్తం 5,86,700 విమాన టికెట్ రద్దు అయ్యాయని, ఈ సందర్బాన్ని ఆసరాగా చేసుకొని ఇతర సంస్థలు టికెట్ ధరలు పెంచకుండా కేంద్రం పరిమితులు విధించిందన్నారు. టికెట్టు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఆయా ప్రయాణికులకు రీఫండ్ అమౌంట్ సెటిల్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇండిగో సంక్షోభంపై విచారణ ప్రారంభం..
ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘విమానాల ఆలస్యం, రద్దుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పౌర విమానయాన శాఖ నిబంధనలు విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇండిగో చెబుతున్న కారణాలపై విచారణ ప్రారంభించాం. నిరంతర సాంకేతిక పరిజ్ఞానం అప్‌గ్రేడేషన్‌లో భాగంగా భారతదేశ విమానయాన రంగానికి అత్యున్నత ప్రపంచ ప్రమాణాలను నిర్ధారించడమే మా లక్ష్యం’ అన్నారు. “ప్రయాణికుల విషయానికొస్తే, మొత్తం 5,86,705 టికెట్లు రద్దు అయ్యాయి. దీనికి రూ. 569 కోట్లు రీఫండ్ చెల్లించారు. దీనితో పాటు సంస్థ పనితీరుపై మరిన్ని విషయాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి” అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంస్థపై కేంద్ర ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు స్పందిస్తూ.. తాము గతంలో కూడా అనేక చర్యలు తీసుకున్నామని, నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు అమల్లో ఉన్నాయని, వాటిని పాటించేలా చేయడమే నియంత్రణ సంస్థగా తమ విధి అని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడల్లా కేంద్రం చర్య తీసుకోవడానికి వెనుకాడలేదని చెప్పారు.

