No Helmet, No Petrol: ఇకపై ద్విచక్ర వాహనదారులంతా అలెర్ట్ కావాల్సిందే! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించదు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ కఠినమైన నిబంధనను తీసుకురానున్నారు. ఇటీవల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై మధ్యప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, అధికారులు ఈ చర్యకు సిద్ధమయ్యారు. ఒకవేళ హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి పెట్రోల్ పోసినట్లయితే, సంబంధిత పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ 2023 ప్రకారం అలాంటి బంకులకు రూ. 5,000 వరకు జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష, లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇండోర్ రోడ్లపై దాదాపు 21 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వాటిలో 16 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలేనని ప్రాంతీయ రవాణా అధికారి వెల్లడించారు. ఈ భారీ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ కొత్త నిబంధనతో ఇండోర్ రోడ్లపై క్రమశిక్షణ, భద్రత రెండూ పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఇది ఇండోర్‌ను మరింత సురక్షితమైన నగరంగా మార్చడంలో ఒక కీలక అడుగు కానుంది భావిస్తున్నారు.


