Saturday, November 15, 2025
Homeనేషనల్Infant Dies : జలుబుకు కర్పూరం.. పసికందు ప్రాణం తీసిన పెద్దల పొరపాటు!

Infant Dies : జలుబుకు కర్పూరం.. పసికందు ప్రాణం తీసిన పెద్దల పొరపాటు!

Dangers of using camphor on babies : పిల్లలకు జలుబు చేస్తే, పెద్దలు తరచుగా వంటింటి వైద్యం పేరుతో కొన్ని పద్ధతులను పాటిస్తారు. అందులో ముఖ్యంగా వినిపించే పేరు ‘కర్పూరం’. ముక్కు దిబ్బడ వదిలించడానికి కర్పూరాన్ని రుద్దడం చాలా ఇళ్లలో చూసేదే. కానీ, ఆయువు పోస్తుందనుకున్న ఆ చిట్కానే ఓ పసికందు ఊపిరి తీసింది. అసలు కర్పూరం పిల్లలకు అంత ప్రమాదకరమా..? దాని వాడకం వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటి..? 

- Advertisement -

తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన, ఎందరో తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. పెద్దలు తరతరాలుగా నమ్ముతున్న ఓ ఇంటి చిట్కా, ఎనిమిది నెలల పసిపాప ప్రాణాన్ని బలిగొంది.

అసలేం జరిగింది : చెన్నైలోని అభిరామపురం, వల్లవన్ నగర్‌కు చెందిన దేవనాథన్ దంపతుల ఎనిమిది నెలల చిన్నారి గత కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతోంది. ముక్కు మూసుకుపోయి పాప ఇబ్బంది పడుతుండటంతో, ఉపశమనం కోసం తల్లిదండ్రులు జులై 13న సాయంత్రం బామ్‌లో కర్పూరం కలిపి పాప ముక్కు, ఛాతీపై రుద్దారు. అలా చేసిన కొద్దిసేపటికే పాపకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన చిన్నారిని ఎగ్మోర్ ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చికిత్స పొందుతూ ఆ పసికందు ప్రాణాలు విడిచింది.

వైద్యులు ఏమంటున్నారు :  ఈ ఘటనపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్పూరం వాడకంపై వారు చేస్తున్న హెచ్చరికలు.

సున్నితమైన చర్మం, వేగంగా విషప్రభావం: “ఏడాది లోపు పిల్లల చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. కర్పూరం వంటి ఘాటైన పదార్థాలను వారి చర్మంపై రుద్దినప్పుడు, అది సులభంగా రక్తంలోకి శోషించబడుతుంది. ఇది నేరుగా విషప్రభావానికి దారితీస్తుంది,” అని వైద్యులు వివరిస్తున్నారు.

మెదడుపై దాడి: కర్పూరం శరీరంలోకి వెళ్ళాక నాడీ వ్యవస్థను, ముఖ్యంగా మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది. “మన శరీర బరువులో కిలోగ్రాముకు 30 మిల్లీగ్రాముల కర్పూరం చేరితే అది విషంగా మారుతుంది. అంటే 10 కిలోల బరువున్న పసికందుకు కేవలం 300 మిల్లీగ్రాముల కర్పూరం (చిన్న కర్పూరం బిళ్లలో సగం కంటే తక్కువ) ప్రాణాంతకం కావచ్చు. దీనివల్ల తీవ్రమైన మూర్ఛ (ఫిట్స్) వస్తుంది. ఈ ఫిట్స్‌ను సాధారణ మందులతో నియంత్రించడం చాలా కష్టం,” అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊపిరితిత్తులకు ముప్పు: ముక్కు దగ్గర కర్పూరం వాసన పీల్చడం వల్ల శ్వాసనాళాలు సంకోచించి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఘటనపై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారి మృతికి అసలు కారణం జలుబు తీవ్రతనా లేక కర్పూరం విషప్రభావమా అనేది శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, వైద్యుల సలహా లేకుండా ఇలాంటి ఇంటి చిట్కాలు పిల్లల ప్రాణాలకే ముప్పు తెస్తాయని ఈ విషాదం మరోసారి రుజువు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad