ఈ సృష్టి ఎన్నో వింతలకు నెలవు. మనుషులతో పాటు కొన్ని జంతువులకు తెలివితేటలు ఉంటాయి. మనుషులు చేసే కొన్ని పనులను చింపాజీ వంటి కొన్ని జంతువులు చేయడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే.. దెబ్బ తగిలితే ఆస్పత్రికి రావాలని ఓ పిల్లికి ఎలా తెలిసిందనేది మాత్రం అర్థం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తూర్పు టర్కీలోని బిట్టిస్ తత్వాన్ స్టేట్ ఆస్పత్రిలోకి నలుపు, తెలుపు రంగుల చారలు గల ఓ పిల్లి వచ్చింది. అది కుంటుకుంటూ ఆస్పత్రి ప్రాంగణం మొత్తం తిరిగింది. ఎవరో వచ్చి తనకు ట్రీట్‌మెంట్ అందిస్తారని అది వేచి చూడడం వీడియోలో కనిపిస్తుంది. అబుజర్ ఓజ్డెమిర్ అనే నర్సు ఆ పిల్లిని గమనించగా.. దాని కాలికి గాయం కనిపించింది. వెంటనే అతడు ఆ పిల్లి కాలికి కట్టుకట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బిట్టిస్ తత్వాన్ స్టేట్ ఆస్పత్రి ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 2k పైగా వీక్షణలు వచ్చాయి.
“నేను పని చేస్తున్నప్పుడు, ఒక పిల్లి కుంటుతూ నడవడం కనిపించింది. నేను దానిని దగ్గరకు తీసుకుని పరీక్షించగా దాని కాలు విరిగినట్లు గమనించాను. చికిత్స అందించి కట్టు కట్టాను. ఆ తరువాత కాసేపు ఆ పిల్లిని నిఘాలో ఉంచాను. కొద్ది సేపటికే పిల్లి రిలాక్స్ అయ్యింది. దానికి మార్గం తెలిసినట్లుగా మళ్లీ అది వచ్చిన చోటి నుండే మళ్లీ బయటికి వెళ్లింది.” అని అబుజర్ ఓజ్డెమిర్ అని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి పరీక్ష చేయించుకోవడానికి కిట్టి తిరిగి వచ్చిందని అబుజర్ పేర్కొన్నాడు. అయితే.. పిల్లికి గాయం ఎలా అయ్యింది. ఎక్కడ ఉంటుంది అనే వివరాలు తెలియరాలేదు.