Keerthana Sampath Sivakasi MLA: చదువు అయిపోయింది.. తర్వాతేంటి.? ఉద్యోగమా, వ్యాపారమా, లేక విదేశీయానమా.? ఇవి ఈ కాలం యువత ఎదుర్కొంటున్న ప్రశ్నలు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువత రాజకీయాల్లోకి అడుగుపెడుతూ నాయకత్వం అనే పదానికి సరైన నిర్వచనం అందిస్తున్నారు. ఊహ తెలిసిన వయసు నుంచి చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రతి అడుగులో తమకు ఎదురైన సవాళ్లు, సామాజిక స్పృహ, డిజిటల్ పరిజ్ఞానం, ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా రాజకీయ అంశాలపై అవగాహన.. ఇవన్నీ తమను ప్రజాసేవలోకి ప్రవేశించేలా చేస్తున్నాయి. తద్వారా రాజకీయం అంటే డబ్బు, పలుకుబడి, నెపోటిజం ఉన్నవారికే చెల్లుతుంది అనే రోజులు పోయాయి. తమ సాధారణ జీవితాలకు చదువుకున్న యువతే ఓ సామాజిక, ఆర్థిక భరోసా కల్పిస్తారనే నమ్మకం ఓటర్లలో మార్పు తీసుకువస్తోంది. ఆ నమ్మకానికి ఫలితమే ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శివకాశి నియోజకవర్గం నుంచి 11వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కీర్తనా సంపత్..
కీర్తనా సంపత్ తమిళ బిడ్డే అయినా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. ఆ భాషా పరిజ్ఞానం కూడా ఆమె విజయంలో కీలక పాత్ర పోషించింది. కీర్తన.. ఎటువంటి రాజకీయ మూలాలు లేని ఓ సామాన్య, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. కానీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో గెలుపొంది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవ్వడమే కాకుండా ఎంతో మంది యువతకి మార్గదర్శకంగా నిలిచారు.
Also Read: https://teluguprabha.net/top-stories/congress-support-tvk-party-in-tamil-nadu/
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టికి చెందిన కీర్తన.. డిగ్రీ వరకు అక్కడే చదువుకుని తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ అభ్యసించారు. డేటా అనలిస్ట్‌గా ఆమెకున్న నైపుణ్యాలతో పొలిటికల్ కన్సల్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. దాంతో ఆమె ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో చోటు దక్కించుకున్నారు. అందులో భాగంగా గోవా, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో ఎం.కె స్టాలిన్ కోసం పనిచేసిన అనంతరం కీర్తనా.. హైదరాబాద్‌కి మకాం మార్చారు. ఇక్కడ టీడీపీ సోషల్ మీడియా టీమ్ లీడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటికే కీర్తన తెలుగులో మాట్లాడగలరు. అదే సమయంలో ఈ విభాగంలో పనిచేస్తున్న తెలుగు యువత సంగిశెట్టి ఉపేందర్, గుర్రం సాయి కిరణ్, రవితేజలతో ఏర్పడిన పరిచయం మన భాషపై మరింత పట్టు సాధించేలా చేసింది. అంతేకాకుండా ఆమె రాజకీయ ప్రచారంతో పాటు విజయంలో వీరి పాత్ర కూడా కీలకం కావడం విశేషం.
అయితే ఇక్కడే ఆమె ప్రయాణం మలుపు తిరిగింది. ఇలా ఒక్కో పార్టీ వెనుక ఉండి ఆ పార్టీ నాయకుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్న తాను.. పుట్టిన ఊరికి ఏం చేయలేక పోయాననే ఆలోచన తనను వెంటాడేది. దేశానికే బాణసంచా రాజధానిగా పేరుగాంచిన శివకాశిలో.. నిత్యం అగ్ని ప్రమాదాలు, చావులతో అయిన వారి ఆర్తనాదాలు, తాగునీరు, వైద్యం, విద్య, సరైన రోడ్లు లేకపోవడం, నిరుద్యోగం, ఉపాధి కోసం వలస బాట పట్టడం.. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తన ప్రాంతం కోసం ఏదైనా చేయాలనే తపన తనను ఉద్యోగం వదిలేసేలా చేసింది. తన రాజకీయ, సోషల్ మీడియా పరిజ్ఞానంతో తమ ప్రాంతంలో మార్పులు తేవాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం స్థానిక సమస్యల గురించి వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడం కోసం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదే ఆమెను లక్షల్లో నెటిజన్స్‌కు పరిచేసింది. దీంతో కొద్ది కాలంలోనే కీర్తనకు లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ రావడంతో.. ఆమె పేరు టీవీకే అధినేత విజయ్ దృష్టికి చేరింది. ఆమె సామాజిక సేవకు మెచ్చి ఎన్నికలకు సరిగ్గా నెల ముందు శివకాశి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/national-news/bengal-cm-mamata-alleged-results-tampered-by-bjp-conspiracy/
ఆ అవకాశాన్ని అదృష్టంగా భావించి.. తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి కీర్తనా సంపత్ తెలుగులో చేసిన ప్రచారం, ప్రసంగాలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫలితమే ప్రత్యర్థిపై 11,670 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతేకాకుండా శివకాశిలో పోటీ చేసి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా కీర్తనే కావడం విశేషం. 30 ఏళ్ల వయసులో కీర్తనా సంపత్ సాధించిన విజయం.. యువతకి స్ఫూర్తిగా నిలవాలని.. ప్రజా నాయకురాలిగా ఆమె ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగాలని ఆశిద్దాం.

