IPS officer harassment case : హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ బలవన్మరణం కేసు రాజకీయ కుంపటిని రాజేస్తోంది. ఆయన మరణించి ఐదు రోజులైనా, శవపరీక్షపై నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చింది. కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా, బలవంతంగా పోస్టుమార్టం నిర్వహించారని బంధువులు ఆరోపిస్తుండగా, ఉన్నతాధికారులు మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నారు. అసలు ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి కుటుంబానికే ఎందుకీ దుస్థితి…? ఆయన సూసైడ్ నోట్‌లో ఎవరి పేర్లున్నాయి..? ఈ కేసు హరియాణా ప్రభుత్వాన్ని ఎందుకు కుదిపేస్తోంది..?
హరియాణా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉన్నతాధికారుల వేధింపులే తన సోదరుడి మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న వేళ, శవపరీక్ష విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు వివాదాన్ని మరింత జఠిలం చేశాయి. శనివారం ఆయన మృతదేహాన్ని సెక్టార్ 16 ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం నిమిత్తం పీజీఐకి తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా, బలవంతంగా మృతదేహాన్ని తరలించారని వారు ఆరోపిస్తున్నారు.
శవపరీక్షపై తీవ్ర వివాదం : “మా అనుమతి లేకుండా, బలవంతంగా నా సోదరుడి మృతదేహాన్ని పీజీఐకి తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. మాకు న్యాయం జరగడం లేదు. ఐదు రోజులు గడిచినా ఏడీజీపీ స్థాయి అధికారి ఒకరు వచ్చి కనీసం పలకరించలేదు,” అని పూరన్ కుమార్ సోదరుడు, ఆప్ ఎమ్మెల్యే అయిన అమిత్ రతన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలను చండీఘడ్ డీజీపీ ఖండించారు. “కుటుంబ సభ్యుల సమ్మతితోనే పోస్టుమార్టం జరుగుతుంది. వారి అనుమతి కోరాం. పీజీఐలో ప్రత్యేక వైద్యుల బోర్డును ఏర్పాటు చేశాం. మొత్తం ప్రక్రియను వీడియో, ఫొటో తీయిస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ దుమారం.. అధికారుల బదిలీ : ఈ కేసు హరియాణాలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ, “కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాన్ని తరలించడం అమానుషం. కనీసం కడసారి చూపు చూసుకునేందుకు కూడా ఆయన కుమార్తెలను అనుమతించలేదు. ఒక సీనియర్ ఐపీఎస్ కుటుంబానికే న్యాయం జరగకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి..?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ, “ఐజీ ర్యాంక్ అధికారి కుల వివక్ష, వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది,” అని పేర్కొన్నారు. ఈ రాజకీయ దుమారం నేపథ్యంలో, ప్రభుత్వం రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను బదిలీ చేసి, ఆయన స్థానంలో సురేంద్ర భౌరియాను నియమించింది.
సూసైడ్ నోట్.. సంచలన ఆరోపణలు : పూరన్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్, తన భర్త మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమంటూ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. తన భర్త రాసిన 8 పేజీల సూసైడ్ నోట్‌లో ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాల గురించి స్పష్టంగా పేర్కొన్నా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం, పూరన్ కుమార్ తన వేతన బకాయిల గురించి ప్రశ్నించినందుకు ఉన్నతాధికారులు ఆయనను వేధించడమే కాక, జీతాన్ని నిలిపివేశారు. తండ్రి అంత్యక్రియలకు సెలవులు అడిగినా ఇవ్వకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏడీజీపీ సంజయ్ కుమార్, ఐజీపీ పంకజ్ నైన్ సహా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, టీవీఎస్‌ఎన్ ప్రసాద్, రాజీవ్ అరోరా అనే ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లను చేర్చారు. తన భర్త మరణానికి కారణమైన వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అమ్నీత్ సీఎంను కోరారు.


