Saturday, November 15, 2025
Homeనేషనల్Gaganyaan Mission: గగన్‌యాన్‌ కోసం ఇస్రో భారీ వ్యయం.. శుభాంశు శుక్లా యాత్రకు రూ.550 కోట్లు!

Gaganyaan Mission: గగన్‌యాన్‌ కోసం ఇస్రో భారీ వ్యయం.. శుభాంశు శుక్లా యాత్రకు రూ.550 కోట్లు!

ISRO Cost Axiom Mission: నలభై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి తిరిగివచ్చారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో విహరించిన భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ అరుదైన యాత్ర వెనుక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేసిన భారీ వ్యయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క వ్యోమగామి కోసం ఇస్రో ఏకంగా రూ.550 కోట్లు ఎందుకు ఖర్చు చేసింది..? ఈ ఖర్చు వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి..? ఇది భారత అంతరిక్ష ప్రస్థానాన్ని ఎలా మలుపు తిప్పనుంది..? 

- Advertisement -

అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన ఏఎక్స్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు. అయితే, ఆ మిషన్‌లోని ఒక సీటును శుక్లా కోసం రిజర్వ్ చేయడానికి ఇస్రో ఏకంగా 59 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ.550 కోట్లు చెల్లించింది. ఈ భారీ పెట్టుబడి వెనుక ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టు దాగి ఉంది.

గగన్‌యాన్‌కు బీజాలు వేసిన యాత్ర:

2027లో తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మానవసహిత అంతరిక్ష యాత్రను (గగన్‌యాన్) చేపట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ కోసం ఇప్పటికే నలుగురు వాయుసేన అధికారులను ఎంపిక చేయగా, వారిలో శుభాంశు శుక్లా ఒకరు. గగన్‌యాన్‌ను విజయవంతం చేయాలంటే వ్యోమగాములకు ప్రత్యక్ష అనుభవం, క్షేత్రస్థాయి అవగాహన అత్యంత కీలకం. ఈ ఒక్క ఉద్దేశంతోనే, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇస్రో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించింది.
ఏఎక్స్-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా 20 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో గడిపారు. ఈ సమయంలో అక్కడి సాంకేతిక అంశాలు, జీవనశైలి, నిర్వహణ, అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పూర్తి అవగాహన పొందారు. “యాక్సియం స్పేస్ మిషన్, భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ కార్యక్రమానికి గట్టి బీజాలు వేసింది. ఈ యాత్ర నుంచి నేర్చుకున్న పాఠాలు మన మానవసహిత మిషన్లకు ఎంతగానో ఊతమిస్తాయి” అని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

భూమికి చేరిక, పునరావాసం:

మిషన్ కమాండర్ పెగ్గీ వైట్సన్ (అమెరికా) సహా ఇతర వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అనంతరం వారిని వెంటనే పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ ఫ్లైట్ సర్జన్ల పర్యవేక్షణలో వారం రోజుల పాటు ఉండి, భూ వాతావరణానికి శరీరం అలవాటు పడ్డాక బయటకు వస్తారు.

నాడు రాకేశ్ శర్మ.. నేడు శుభాంశు శుక్లా:

ఈ యాత్ర ద్వారా శుక్లా కేవలం అంతరిక్షంలోకి వెళ్లిరాలేదు, కోట్లాది భారతీయుల ఆశలను మోసుకెళ్లారు. “అంతరిక్షం నుంచి చూస్తే, గొప్ప ఆశయాలతో వెలుగొందుతున్న భారత్ నిర్భయంగా, విశ్వాసంతో, సగర్వంగా కనిపించింది. “సారే జహా సె అచ్ఛా” అన్నట్లుగా తనకు కనిపించిన దేశం గురించి ఆయన పంపిన సందేశం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేసింది. 1984లో రాకేశ్ శర్మ వెలిగించిన కీర్తి జ్యోతిని, నేడు శుభాంశు శుక్లా మరోసారి ప్రకాశవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad