Saturday, November 15, 2025
HomeTop StoriesIT Refund: ఐటీ రీఫండ్ అమౌంట్‌ ఇంకా మీ ఖాతాలో పడలేదా?.. అయితే, వెంటనే ఇలా...

IT Refund: ఐటీ రీఫండ్ అమౌంట్‌ ఇంకా మీ ఖాతాలో పడలేదా?.. అయితే, వెంటనే ఇలా చేయండి

IT Refund Not Credited into Bank Account: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే గడువు ముగిసింది. చాలా మంది అకౌంట్లలో రీఫండ్‌ అమౌంట్‌ పడింది. అయితే, రిటర్నులు ప్రాసెస్ అయినప్పటికీ తమకు ఇంకా రీఫండ్ డబ్బులు రాలేదంటూ కొద్ది మంది పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ రిటర్ను స్టేటస్ ‘ప్రాసెస్డ్’ అని చూపిస్తున్నా, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ 16తో ఐటీ రిటర్న్స్‌ గడువు ముగియగా, ఆ తర్వాత కూడా కొందరు రిటర్నులు దాఖలు చేశారు. దీంతో మొత్తం 7.68 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 6.11 కోట్ల రిటర్నులను ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ రీఫండ్ల జారీలో జాప్యం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. అటువంటి వారు తమ రీఫండ్‌ అమౌంట్‌ ఎందుకు రాలేదు? రీఫండ్‌ అమౌంట్‌ ఎలా పొందాలి? విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

- Advertisement -

రీఫండ్ ఆలస్యానికి కారణాలు ఇవే..!

సాధారణంగా ఐటీ రిటర్న్స్‌ రీఫండ్ ఆలస్యం కావడానికి కొన్ని ముఖ్య కారణాలు కొన్ని ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉండటం ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. బ్యాంకు అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఇస్తే, ఆదాయపు పన్ను శాఖ రీఫండ్‌ను నిలిపివేస్తుంది. సరైన, ధృవీకరించిన బ్యాంకు ఖాతా ఉన్నవారికే రీఫండ్ జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ, ఫారం 26 ఏఎస్‌లోని టీడీఎస్ వివరాలకు, మీరు ఐటీఆర్‌లో క్లెయిమ్ చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లైతే రీఫండ్ ప్రక్రియను నిలిపివేస్తారు.

రీఫండ్‌ పరిష్కారం ఎలా?

ఒకవేళ మీ రీఫండ్ రాకపోతే, ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ‘రీఫండ్/డిమాండ్ స్టేటస్’ సెక్షన్‌లో చెక్‌ చేయాలి. బ్యాంకు వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని వెంటనే సరిచేసి ‘రీఫండ్ రీ-ఇష్యూ’ కోసం మరోసారి రిక్వెస్ట్‌ పెట్టవచ్చు. ఐటీఆర్‌ పోర్టల్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ, మీ అన్ని వివరాలు సరిగ్గా ఉండి, రీఫండ్ జారీ అయినట్లు కోడ్ చూపించినా డబ్బులు రాకపోతే, మీ బ్యాంకు శాఖను లేదా ఎన్ఎస్‌డీఎల్‌ను సంప్రదించాలి. సాధారణంగా రీఫండ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అకౌంట్‌లో డబ్బులు జమకావు. రీఫండ్‌ అమౌంట్‌ ఖాతాలో జమ కావడానికి 15 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే నెల రోజుల వరకు వేచి చూడటం ఉత్తమం. అప్పటికీ రీఫండ్ రాకపోతే ఆదాయపు పన్ను శాఖ అధికారులను సంప్రదించండి. మీ సమస్యకు గల కారణాలను తెలియజేసి రీఫండ్‌ అమౌంట్‌ వచ్చేలా చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad