IUML again announces support for Vijay: తమిళనాడు రాజకీయం గంటకో మాదిరిగా ట్విస్టుల మీద ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. విజయ్ పార్టీకి మద్దతుపై చిన్న పార్టీలు ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తున్నాయి. అయితే, చర్చల అనంతరం ఈ నెంబర్ గేమ్‌కు ఎట్టకేలకు ఎండ్‌కార్డ్ పడింది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటుపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి తొలుత మద్దతు ప్రకటించి.. మళ్లీ మద్దతు వెనక్కి తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) చివరికి విజయ్ వైపే నిలిచింది. ఐయూఎంఎల్ మద్ధతుతో ప్రమాణస్వీకారానికి ఏర్పాటు చేసుకున్న విజయ్‌కి గట్టి షాకిచ్చి మద్ధతును ఉపసంహరించుకున్న ఆ పార్టీ.. మళ్లీ మనసు మార్చకుంది. విజయ్‌కి మద్ధతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ అందజేసింది. ఇవాళ సాయంత్రం ఐయూఎంఎల్ శాసనసభా పక్ష నేత ఎస్ఎస్‌బీ సయ్యద్ ఫరూక్ బాషా, ఉప నేత ఏఎం షాజహాన్… గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి తమ మద్దతు లేఖను అందజేశారు. దీంతో విజయ్ కూటమి బలం 120కి చేరింది. నిన్న ఉదయం మద్దతు ప్రకటించి, సాయంత్రానికి మాట మార్చి గందరగోళం సృష్టించిన ఐయూఎంఎల్.. చివరికి టీవీకే పార్టీకి మద్దతిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ అందించడం కొసమెరుపు.
Also Read: https://teluguprabha.net/telangana/special-movie-on-revanth-reddy-political-journey/
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం..
అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే గవర్నర్ కేరళ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి రేపటితో ముగియనుంది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడంతో త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున మీడియాకు స్పష్టం చేశారు.
ఐయూఎంఎల్ మద్ధతుతో 120కి చేరిన బలం..
కాగా, విజయ్ టీవీకే పార్టీకి ఐయూఎంఎల్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, తాజా పరిణామాలతో టీవీకే కూటమి బలం 120కి చేరింది. ఇందులో టీవీకేకు 107 మంది, కాంగ్రెస్‌కు 5, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌లకు తలా ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలున్నారు. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించగా.. ఆయన ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ పార్టీ బలం 107కి తగ్గింది.

