Jagdeep Dhankhar’s multiple Pensions : ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి గతంలో ఎమ్మెల్యే పదవిలోని పింఛన్ అందుకోవడం సాధ్యమేనా..? అవుననే సమాధానం వస్తోంది రాజస్థాన్ నుంచి. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇప్పుడు ఏకంగా మూడు వేర్వేరు ఫించన్లను అందుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ లెక్కేంటి..? ఆయనకు ఏ హోదాలో ఎంత ఫించను వస్తుంది..? దాని వెనుక ఉన్న నిబంధనలేంటి..?
ఆమోదం తెలిపిన అసెంబ్లీ : రాజస్థాన్ శాసనసభ మాజీ ఎమ్మెల్యేగా తనకు పింఛను పునరుద్ధరించాలని మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం లభించింది. ఈ దరఖాస్తును రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్‌నాని ఆమోదించారు. దీంతో ధన్‌ఖడ్ నెలకు రూ. 42,000 మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌తో పాటు, పలు ఇతర సౌకర్యాలను కూడా పొందనున్నారు.
ఎందుకీ పెన్షన్, నియమం ఏమిటి : జగదీప్ ధన్‌ఖడ్ 1993 నుంచి 1998 వరకు రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ అందుతోంది.
నిలిచిపోయిన పెన్షన్: 2019 జులైలో ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధమైన, జీతం అందుకునే పదవిని చేపట్టినప్పుడు, మాజీ ప్రజాప్రతినిధిగా వచ్చే పెన్షన్ నిలిచిపోతుంది. ఆ నిబంధన ప్రకారం అప్పటి నుంచి ఆయన పెన్షన్ ఆగింది.
తిరిగి ప్రారంభం: ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తర్వాత, ఆయన తన మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌ను పునఃప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటేరియట్‌కు నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అన్ని లాంఛనాలు పరిశీలించిన తర్వాత, అసెంబ్లీ ఆయన పింఛనుకు ఆమోదముద్ర వేసింది.
మొత్తం మూడు పెన్షన్లు : జగదీప్ ధన్‌ఖడ్ ఇప్పుడు కేవలం మాజీ ఎమ్మెల్యే పెన్షన్ మాత్రమే కాకుండా, మరో రెండు పెన్షన్లను కూడా అందుకుంటారు.
మాజీ ఎంపీగా: ఆయన 1989 నుంచి 1991 వరకు ఝుంఝును నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.
మాజీ ఉపరాష్ట్రపతిగా: 2022 ఆగస్టు నుంచి 2025 జులై వరకు ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు.
మాజీ ఎమ్మెల్యేగా: 1993 నుంచి 1998 వరకు రాజస్థాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
లభించే ఇతర సౌకర్యాలు : మాజీ ఎమ్మెల్యేగా ధన్‌ఖడ్‌కు కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా రాజస్థాన్ ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తుంది.
ఉచిత వైద్యం: RGHS పథకం కింద రిటైర్డ్ అధికారులతో సమానంగా ఉచిత వైద్య చికిత్స.
ఉచిత ప్రయాణం: రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సుల్లో ఆయనతో పాటు మరో సహాయకుడికి ఉచిత ప్రయాణం.
విదేశీ ప్రయాణ భత్యం: ఏడాదికి లక్ష రూపాయల వరకు విదేశీ ప్రయాణ ఛార్జీల రీయింబర్స్‌మెంట్.
వసతి: ప్రభుత్వ అతిథి గృహాలు, డాక్ బంగ్లాలలో నెలకు 5 రోజులు రాయితీ ధరలపై బస.


