Karnataka Deputy CM: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సహకరిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం తనకు నేరుగా ఆఫర్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆ కీలక ఆఫర్‌ను తిరస్కరించి, జైలుకు వెళ్లడానికే మొగ్గు చూపానని స్పష్టం చేశారు.
తనపై రాసిన “A Symbol of Loyalty D K Shivakumar” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో డీకేఎస్ ఈ పాత రహస్యాన్ని బయటపెట్టారు. “2019లో సుమారు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా కోసం స్పీకర్ వద్దకు వెళ్లారు. నేను వారిలో ఐదుగురు, ఆరుగురిని వెనక్కి తీసుకురాగలిగాను. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీ నుంచి ఓ భాజపా నేత నాకు ఫోన్ చేశారు. ‘మీరు డిప్యూటీ సీఎం అవుతారా? లేక జైలుకు వెళ్తారా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోండి’ అని అడిగారు” అంటూ నాటి తీవ్ర ఒత్తిడిని డీకే శివకుమార్ గుర్తు చేసుకున్నారు. ఆ ఫోన్ కాల్ ఒక ఆదాయపు పన్ను ఆడిటర్ ఫోన్ నుంచి వచ్చిందని, ఆ సమయంలో తన సోదరుడు డీకే సురేశ్ కూడా తనతోనే ఉన్నారని ఆయన వివరించారు.
రాజీవ్ గాంధీ సహకారంతో రాజకీయాల్లో ఎదిగిన తాను కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నానని, అందుకే అధికారం కంటే పార్టీ విధేయతకే విలువనిచ్చి జైలుకు వెళ్లడానికి సిద్ధపడ్డానని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో తన విశ్వసనీయతను మరింతగా చాటుకున్నారు.
కాగా, డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రస్తుత రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు, ముఖ్యంగా ‘నవంబర్ విప్లవం’ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, డీకేఎస్ తన విధేయతను హైలైట్ చేస్తూనే, తనకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయనే పరోక్ష సంకేతాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏదేమైనా, 2019 సంకీర్ణ ప్రభుత్వం చివరకు కూలిపోయి బీజేపీ అధికారంలోకి రావడం, ఆ తరువాత సెప్టెంబర్ 2019లో డీకేఎస్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ కావడం నాటి రాజకీయ డ్రామాకు పరాకాష్ట.


