Saturday, November 15, 2025
Homeనేషనల్Jaipur Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం, 50 మందికి...

Jaipur Road Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం, 50 మందికి తీవ్ర గాయాలు

Jaipur Road Accident Died 10 Members: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి రోడ్డు ప్రాంతంలో ఇవాళ (సోమవారం) భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన డంపర్ ట్రక్ డ్రైవర్, కంట్రోల్ తప్పి సుమారు 5 కిలోమీటర్ల మేర వేగంగా వాహనాలను ఢీకొడుతూ భారీ భీభత్సం సృష్టించాడు. ఈ బీభత్సంలో ఎదురుగా వచ్చిన కార్లు, మోటార్‌సైకిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మత్తులో అతివేగంగా ట్రక్కును నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ట్రక్ వాహనాలను ఢీకొంటూ వెళ్లిన తర్వాత, చివరకు ఒక పెద్ద గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

- Advertisement -

డ్రైవర్ అరెస్ట్, మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటన..

ఈ బీభత్సానికి కారణమైన ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌లో మద్యం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసులు 10 మృతదేహాలను స్వచ్ఛంద సంస్థల సహాయంతో బయటకు తీసి, మృతుల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఈ దుర్ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జైపూర్ ప్రమాదానికి కొద్ది గంటల ముందు, రాజస్థాన్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఫలోడీ జిల్లాలో టెంపో ట్రావెలర్, ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. జోధ్‌పూర్ సూర్‌సాగర్ ప్రాంతానికి చెందిన యాత్రికులు కోలాయత్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ వరుస రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఆందోళన రేకెత్తిస్తోంది.

మద్యం మత్తులో డంపర్‌ డ్రైవర్‌?
అయితే, ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో డంపర్‌ డ్రైవర్‌ మద్యం సేవించినట్లు ప్రాధమికంగా గుర్తించారు. ఐదు కిలోమీటర్ల మేర అతను వాహనాలను ఢీకొంటూ ముందుకు సాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘డంపర్‌ ట్రక్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు. రోడ్డుమీద వాహనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. వాహనాలు ప్రమాదానికి గురవుతున్నా ఆపకుండా ముందుకు వెళ్లాడు. ’ అని వారు పేర్కొన్నారు. అయితే, డంపర్‌ డ్రైవర్‌ మద్యం సేవించాడా? లేక వాహనంలో బ్రేక్‌ ఫెయిల్యూర్‌ జరిగిందా? అనే కోణాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad