జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్‌ఓసీ వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భారత సైన్యం అప్రమత్తమై కాల్పులు జరుపుతోంది. బుధవారం రాత్రి మెంధర్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. సెంట్రీగా ఉన్న జవాన్లు ఓ అనుమానాస్పద కదలికను గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే స్పందించిన సైన్యం ఆ దిశగా కాల్పులు జరిపింది. దీంతో ఎల్‌ఓసీ వెంబడి ఉగ్రవాదులు చొరబాటు చేసే యత్నాలను తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు.
కాల్పుల అనంతరం, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కలిసి సమీపంలోని లసానా అడవిలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు ఎక్కడైనా దాగి ఉండే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, అత్యాధునిక పరికరాలతో అన్వేషణ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఎల్‌ఓసీ వెంబడి పాక్ వైపు నుంచి చొరబాటు ప్రయత్నాలు, కాల్పులు, ఐఈడీ దాడులు మరల పెరిగాయి. ఏప్రిల్ 1న కృష్ణ ఘాటీ సెక్టార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కూడా భారత సైన్యం గట్టిగా స్పందించింది.
ప్రస్తుతం భారత సైన్యం ఎల్‌ఓసీ వద్ద అత్యున్నత స్థాయిలో అప్రమత్తత పాటిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు, ఉగ్రవాదం మీద ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుత హిమపాతం తక్కువగా ఉండటంతో చొరబాటు మార్గాలు తెరిచి ఉండటం సైన్యానికి సవాలుగా ఉన్నా, నిఘా, వేగవంతమైన చర్యలతో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలో ఉంచినట్లు తెలుస్తోంది.