Saturday, November 15, 2025
Homeనేషనల్J&K Terror Plot: కశ్మీరంలో కల్లోలం సృష్టించే కుట్ర.. వైద్యుల ముసుగులో ఉగ్రవాదులు!

J&K Terror Plot: కశ్మీరంలో కల్లోలం సృష్టించే కుట్ర.. వైద్యుల ముసుగులో ఉగ్రవాదులు!

J&K inter-state terror module bust : కశ్మీర లోయను నెత్తురోడించేందుకు ఉగ్రవాదులు పన్నిన అతిపెద్ద కుట్రను జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. దేశ సరిహద్దులు దాటి వేళ్లూనుకున్న ఈ అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠాను ఛేదించి, పెను ప్రమాదాన్ని నివారించారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల పరిమాణం చూసి దర్యాప్తు అధికారులే నివ్వెరపోయారు. అయితే, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న విషయం మరొకటి ఉంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే, ప్రాణాలు తీసేందుకు సిద్ధపడటం! అసలు ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరు? వీరి లక్ష్యం ఏమిటి? ఆ వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు స్వాధీనం : గత 15 రోజులుగా అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టిన జమ్మూకశ్మీర్ పోలీసులు, సోమవారం ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ అంతర్రాష్ట్ర, దేశ సరిహదొంతర ఉగ్రవాద ముఠాకు చెందిన ఏడుగురు కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీనగర్ పోలీస్ ప్రతినిధి తెలిపారు. వారి నుంచి ఏకంగా 2,900 కిలోల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ పేలుడు పదార్థాలతో లోయలో వరుస దాడులకు ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వైద్యుల ముసుగులో విధ్వంసం : ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే అంశం, అరెస్టయిన ఏడుగురిలో ఇద్దరు వైద్యులు ఉండటం. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ, తెర వెనుక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన చేతులతోనే, విధ్వంసానికి కుట్ర పన్నడం కశ్మీరంలో కలకలం రేపుతోంది. వీరు తమ వృత్తిని అడ్డం పెట్టుకుని, ఉగ్రవాదులకు సహకారం అందించారా? లేక పేలుడు పదార్థాల రవాణాలో కీలక పాత్ర పోషించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

జైషే, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ప్రమేయం : ఈ ఉగ్రవాద ముఠాకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ (JeM), అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సరిహద్దుల నుంచి పేలుడు పదార్థాలను ఎలా తరలించారు? స్థానికంగా ఎవరు సహకరించారు? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ భారీ ఆపరేషన్‌తో కశ్మీరంలో ఓ పెను విధ్వంసానికి పోలీసులు అడ్డుకట్ట వేసినట్లయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad