Homeనేషనల్Terrorism : జంతర్ మంతర్‌లో జైషే కుట్ర.. రక్షక భటుల దుస్తుల్లో అలజడికి స్కెచ్

Terrorism : జంతర్ మంతర్‌లో జైషే కుట్ర.. రక్షక భటుల దుస్తుల్లో అలజడికి స్కెచ్

Jantar Mantar terror plot : దేశ రాజధాని దిల్లీ వేదికగా ఆందోళనలు చేపడుతున్న విద్యార్థుల నిరసనల్లోకి రక్షక భటుల (పోలీసుల) దుస్తుల్లో చొరబడి, భారీ విధ్వంసానికి ఒడిగట్టేందుకు ఉగ్రవాద మూలాలు అత్యంత ప్రమాదకరమైన కుట్రను పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) చేపట్టిన మెరుపు దాడిలో పట్టుబడిన ఒక అనుమానిత ఉగ్రవాది, అతని మహిళా సహాయకురాలి విచారణలో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. కేవలం రాజధానిలోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌లోని కీలక రాజకీయ నాయకులను, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ‘హనీట్రాప్’ వ్యూహాలను కూడా ఈ ముఠా అమలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 

- Advertisement -

ముఠా గుట్టు రట్టు: హమీమ్ మోండల్, అర్పితా సర్కార్‌ల అరెస్టు : పశ్చిమ బెంగాల్లోని పూర్బా బర్ధమాన్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం హమీమ్ మోండల్ అనే యువకుడిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి డిజిటల్ కమ్యూనికేషన్లను క్షుణ్ణంగా విశ్లేషించిన పిమ్మట, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ ప్రాంతంలో నివసిస్తున్న అతడి ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అర్పితా సర్కార్‌ను కూడా ఎస్టీఎఫ్ బృందం అరెస్టు చేసింది. నాలుగు సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమున్న వీరిద్దరూ ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (JeM) ఉగ్ర సంస్థ నెట్‌వర్క్‌లో చిక్కుకున్నట్లు ఆధారాలు లభించాయి.

జంతర్ మంతర్ వద్ద దారుణానికి ప్రణాళిక : విచారణ సందర్భంగా ఎస్టీఎఫ్ ఐజీ గౌరవ్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనల్లో చొరబడాలని పాక్ హ్యాండ్లర్లు హమీమ్‌ను ఆదేశించారు. సాధారణ పౌరులుగా కాకుండా, పోలీసు యూనిఫారాలు కొనుగోలు చేసి రక్షక భటుల వేషధారణలో ఆందోళనకారుల మధ్యలోకి వెళ్లాలని ప్రణాళిక రచించారు. పోలీసుల దుస్తుల్లో ఉన్న నిందితులు విద్యార్థులపై లేదా నిరసన ప్రదర్శనపై హింసాత్మక చర్యలకు పాల్పడితే, దేశవ్యాప్తంగా అశాంతి, గందరగోళం చెలరేగుతుందనేది పాక్ హ్యాండ్లర్ల దుర్బుద్ధిగా గుర్తించారు. మహిళలు, పురుషులతో కూడిన చిన్న బృందాన్ని దిల్లీకి పంపించేందుకు సిద్ధమవుతుండగానే ఎస్టీఎఫ్ అధికారులు ఈ కుట్రను ముందే పసిగట్టి వారిని అడ్డుకున్నారు.

హనీట్రాప్ వ్యూహాలు – ప్రముఖ రాజకీయ నాయకులే లక్ష్యం : పాకిస్థాన్ ఉగ్ర నెట్‌వర్క్ కేవలం దిల్లీ నిరసనలతోనే ఆగకుండా, పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపేందుకు కుట్ర పన్నింది. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి భద్రతపై, ఆయన కదలికలపై సమాచారం సేకరించాలని పాక్ హ్యాండ్లర్లు హమీమ్‌కు నిర్దేశించినట్లు ఎస్టీఎఫ్ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండే అర్పితా సర్కార్‌ను ఉపయోగించి రాజకీయ నాయకులు, ప్రముఖులను ‘హనీట్రాప్’ చేసేందుకు యత్నించారు.  బెంగాల్ మంత్రి ఉమేష్ రాయ్ కుమారుడిని హనీట్రాప్ ద్వారా బురిడీ కొట్టించి, కిడ్నాప్ చేసి భారీగా నిధులు వసూలు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది.

పాక్ ఆధారిత హ్యాండ్లర్లు – ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా ఆపరేషన్లు : ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌లోని షెహజాద్ భట్టి గ్యాంగ్‌తో పాటు జైషే మహ్మద్‌తో సంబంధమున్న ఉగ్ర హ్యాండ్లర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

పాక్ హ్యాండ్లర్ల పేర్లు: నిందితులు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ‘రానా’, ‘ఉజైర్’, ‘అబిద్ జట్’ అనే పేర్లతో ఉన్న పాకిస్థానీ ఆపరేటర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. సోషల్ మీడియా ద్వారా వల విసిరిన పాక్ హ్యాండ్లర్లు, కొద్ది నెలల వ్యవధిలోనే వీరికి తీవ్రవాద భావజాలాన్ని నూరిపోసి చట్టవ్యతిరేక పనులకు ఉపయోగించుకున్నారు.  ప్రస్తుతం వీరిద్దరి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల చాటింగ్‌లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News