Bihar Elections JDU leader Resignation: బిహార్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కోలుకోలేని దెబ్బ తగిలింది. నితీశ్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి జై కుమార్ సింగ్ జేడీయూను వీడారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో జేడీయూకి బిగ్ షాక్ తగిలినట్లైంది. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై జై కుమార్ సింగ్ పలు ఆరోపణలు చేశారు.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జేడీయూ పార్టీ తీవ్రంగా విఫలం అవుతోందని జై కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకుల అభిప్రాయం మేరకు నితీష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇంకా చాలా విషయాలపై ఎవరికీ సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇక పార్టీలో కొనసాగలేనని నిర్ణయించుకున్నట్లు జైకుమార్ సింగ్ వివరించారు. నాయకత్వం నిర్ణయాలతో భవిష్యత్‌లో పార్టికి మరిన్ని ఇబ్బందులు తప్పవని వెల్లడించారు.
కాగా, ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకంపై ప్రధాన పార్టీలు జేడీయూ, బీజేపీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ రెండు పార్టీలు 101 సీట్ల చొప్పున పంచుకోగా.. కూటమిలో మరో ప్రధాన పార్టీ అయిన జనశక్తి 29 స్థానాల్లో పోటీ చేసేలా నిర్ణయించారు. అయితే.. ఈ సీట్ల పంపకాలపై జేడీయూలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోహ్తాస్ జిల్లాలోని దినారా అసెంబ్లీ నియోజకవర్గం నుండి జేడీయూ నేత జై కుమార్ సింగ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పంపకాల్లో భాగంగా ఆయనకు రావాల్సిన టికెట్ వేరే నేతకు దక్కనుంది.
దీంతో జైకుమార్ తీవ్ర మనస్తాపానికి గురికావడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక జై కుమార్‌కు మద్దతుగా తాము రాజీనామా చేస్తామని రోహ్తాస్ జిల్లా కార్యవర్గం కూడా ప్రకటించడంతో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ సంక్షోభాన్ని నితీష్ కుమార్ ఎలా పరిష్కరిస్తారన్న అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, మాజీ ఎమ్మెల్యే రామచంద్ర సాహ్ని ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పగా.. ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో టికెట్ల కేటాయింపులో అసంతృప్తే పార్టీలు మారడానికి కారణాలుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.


