historical significance of Jeep Wagoneer: 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి సమర్పించిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ కనుల పండువ చేసింది. కానీ, అదే సమయంలో నిశ్శబ్దంగా అక్కడికి చేరుకున్న ఓ పాతకాలపు వాహనం అందరి దృష్టినీ ఆకర్షించింది. దాని రాజసం, స్టైలిష్ లుక్ చూసి ప్రతిఒక్కరూ అబ్బురపడ్డారు. ఆ వాహనంలో వచ్చింది ఎవరో కాదు, దిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) లెఫ్టినెంట్ జనరల్ భవ్నీశ్ కుమార్. ఇంతకీ, అమెరికన్ ‘జీప్’ కంపెనీకి చెందిన ఆ వాహనానికి అంతటి ప్రాధాన్యత ఎందుకు..? దానికి, భారత సైన్యానికి ఉన్న విడదీయరాని బంధం ఏమిటి..? భూటాన్ రాజు ఇచ్చిన ఆ కానుకను మన సైన్యం ఎందుకు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది..?
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఏటా కనిపించే ఓ అపురూప దృశ్యం వెనుక, రెండు దేశాల స్నేహానికి, సైనిక క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే ఓ గొప్ప కథ దాగి ఉంది. ఆ కథే ‘జీప్ వాగనీర్’ అనే ఐకానిక్ ఎస్‌యూవీది. ఈ ఏడాది కూడా ఎర్రకోట వద్ద తన హుందాతనాన్ని ప్రదర్శించి, చూపరులను ఆకట్టుకుంది.
భూటాన్ రాజు ప్రేమకు గుర్తు : 1965లో నాటి భూటాన్ రాజు ఈ విశిష్ట వాహనాన్ని అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు బహుమతిగా అందించారు. ఇది భారత్-భూటాన్ దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. అప్పటి నుంచి ఈ ‘జీప్ వాగనీర్’ భారత దేశానికి ఒక విలువైన ఆస్తిగా మారింది. 2000 సంవత్సరంలో, ఈ చారిత్రక వాహనాన్ని భారత సైన్యానికి అప్పగించారు. ప్రస్తుతం దిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం దీన్ని సంరక్షిస్తోంది.
పాత రూపం.. కొత్త పరుగు : కాలక్రమంలో, ఈ వాహనం పటిష్టతను పెంచేందుకు భారత సైన్యం దీనిని ఆధునికీకరించింది. పాతకాలపు క్లాసిక్ బాడీని యథాతథంగా ఉంచి, శక్తివంతమైన ‘ఫోర్డ్ ఎండీవర్ 2500 సీసీ’ ఇంజిన్‌ను అమర్చారు. దీంతో, పాతతరం రాజసానికి, కొత్తతరం వేగానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. ప్రస్తుతం, దిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) హోదాలో ఉన్నవారు మాత్రమే దీనిని అధికారికంగా ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు, GOC ఈ వాహనంలోనే ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి ఎర్రకోటకు చేరుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది.
‘వాగనీర్’ ఘన చరిత్ర : వాహన నిర్మాణ రంగంలో ‘జీప్ వాగనీర్’ది ఒక చెరగని ముద్ర.
1962 నుంచి 1991 వరకు, అంటే దాదాపు 29 ఏళ్ల పాటు, వాహనం బాడీలో పెద్దగా మార్పులు చేయకుండానే జీప్ కంపెనీ దీనిని ఉత్పత్తి చేసింది. ఇది దాని ప్రజాదరణకు నిదర్శనం. అమెరికా ఆటోమొబైల్ చరిత్రలో అత్యధిక కాలం ఉత్పత్తి అయిన ఎస్‌యూవీలలో ఇది మూడవదిగా రికార్డు సృష్టించింది. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, తొలిసారిగా ‘స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం’ (SUV) అనే పదాన్ని మార్కెటింగ్‌లో వాడింది ఈ మోడల్‌కే, 1974లో. అంతకు ముందు దీనిని ‘స్టేషన్ వ్యాగన్’గా పిలిచేవారు.
ఏళ్లు గడుస్తున్నా, రాజులు మారుతున్నా, భూటాన్ రాజు ఇచ్చిన ఈ కానుకను భారత సైన్యం అంతే ప్రేమతో, అంతే గౌరవంతో కాపాడుకుంటూ, రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది.


