Homeనేషనల్Cancellation : నిరుద్యోగ నిరసనల సెగ.. 44 పరీక్షలు రద్దు చేస్తూ ఝార్ఖండ్‌ సర్కార్...

Cancellation : నిరుద్యోగ నిరసనల సెగ.. 44 పరీక్షలు రద్దు చేస్తూ ఝార్ఖండ్‌ సర్కార్ సంచలనం

Jharkhand recruitment exams cancellation : నియామక ప్రక్రియల్లో పారదర్శకత లోపిస్తే.. ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయత ఏ విధంగా మంటగలుస్తుందో చెప్పేందుకు ఝార్ఖండ్‌ తాజా పరిణామాలే నిదర్శనం. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన అవినీతి అనకొండల ఆటకట్టించేందుకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం అనూహ్య రీతిలో గొడ్డలిపెట్టు వేసింది. గత 25 రోజులుగా యువత కదం తొక్కిన నిరసన జ్వాలల సెగతో, ఏకంగా 2014 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఔట్‌సోర్సింగ్ సంస్థ (TDPL) ఆధ్వర్యంలో జరిగిన 44 కీలక నియామక పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేర్వేరు ఉత్తర్వులను అర్ధరాత్రి జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లు, సివిల్ జడ్జిలు, అసిస్టెంట్ ఇంజినీర్లు వంటి అత్యున్నత స్థాయి కొలువుల భవితవ్యం సైతం రద్దు బాట పట్టడంతో ఉద్యోగార్థుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.  

- Advertisement -

తేనెతుట్టెను కదిలించిన అవకతవకలు: 44 పరీక్షలపై వేటు : రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియల్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మంగళవారం రాత్రి వెలువరించిన నోటిఫికేషన్ల ప్రకారం రద్దయిన వాటిలో అత్యంత కీలకమైన ఉద్యోగాలున్నాయి.

పరిపాలనా, న్యాయ విభాగాలు:డిప్యూటీ కలెక్టర్లు, జూనియర్ డివిజన్ సివిల్ జడ్జిలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.

సాంకేతిక, వైద్య రంగాలు: అసిస్టెంట్ ఇంజినీర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, డెంటల్ డాక్టర్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, అసిస్టెంట్ కన్జర్వేటర్లు

ఉన్నత విద్య: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, సీనియర్ సైంటిఫిక్ అధికారులు.
ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ టీఎస్సార్‌ డేటా ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (TDPL) నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు, ఫలితాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆ సంస్థను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదన.. రంగంలోకి సీఐడీ : ఈ పరీక్షల స్కామ్‌లో లోతైన కుట్ర దాగి ఉందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఈ అవకతవకలను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసింది. జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీలలో జరిగిన అవకతవకల కేసుల సత్వర విచారణ నిమిత్తం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరనున్నారు. రిక్రూట్‌మెంట్ బోర్డులలో ఇకపై ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ఠమైన ‘ఇంటర్నల్ విజిలెన్స్ సెల్’ను ఏర్పాటు చేస్తున్నారు. కమిషన్ల ప్రక్షాళన, పరీక్షా విధానంలో సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్‌ కౌశల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వనుంది.

సీఐడీ దర్యాప్తు: ఇప్పటికే రద్దయిన పరీక్షలతో పాటు మరో 17 పరీక్షల అక్రమాలపై కూడా సీఐడీ ద్వారా విచారణ జరిపిస్తున్నారు. ప్రధాన నిందితుడు అభయ్ తివారీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను విచారణ సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.

బాధితుల ఆందోళనలు – న్యాయ పోరాటం : ఒకవైపు పరీక్షల రద్దు నిర్ణయాన్ని నిరుద్యోగ జేఏసీ వర్గాలు స్వాగతిస్తున్నప్పటికీ, మరోవైపు కొత్త సంక్షోభం తలెత్తింది. జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ (JSSC-CGL) ద్వారా ఎంపికై, ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 2,000 మంది ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు.

“తప్పు చేసినవారిని శిక్షించకుండా.. కష్టపడి మెరిట్‌తో కొలువులు సాధించి, ఇతర ఉద్యోగాలను వదులుకుని వచ్చిన మమ్మల్ని రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం?” అని వారు సచివాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉందని మంత్రులు స్పష్టం చేయడంతో, ఈ వ్యవహారం న్యాయపోరాటానికి దారితీసేలా కనిపిస్తోంది.

జాతీయ స్థాయిలో ‘ఎన్‌టీఏ’ ప్రక్షాళన దిశగా అడుగులు : కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, కేంద్ర స్థాయిలోనూ ప్రవేశ పరీక్షల విశ్వసనీయత ప్రశ్నార్థకమైన వేళ జాతీయ పరీక్షల సంస్థ (NTA) వ్యవస్థాగత మార్పులకు సిద్ధమైంది. యూజీసీ-నెట్‌, నీట్‌-యూజీ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రశ్నపత్రాల భద్రతకు నాలుగు అంచెల తనిఖీ విధానం. విశ్వసనీయత కోల్పోయిన సుమారు 600 మంది నిపుణులను తొలగించి, కొత్త నిపుణుల నియామకం. ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయాలకు సీఐఎస్‌ఎఫ్‌ (CISF) సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత. కార్యకలాపాల పర్యవేక్షణకు త్వరితగతిన 20 నుంచి 25 మంది ఉన్నతాధికారుల భర్తీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News