Thursday, September 19, 2024
Homeనేషనల్Jharkhand CM in trouble: జార్ఖండ్‌ సీఎంకి కష్టకాలం

Jharkhand CM in trouble: జార్ఖండ్‌ సీఎంకి కష్టకాలం

కల్పన సోరెన్ పై కేసులు తేలే వరకూ పోటీకి అనర్హురాలే

ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రస్తుతం జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు కంటి మీద కునుకు పట్టనివ్వడం లేదు. ఆయన మీదా, ఆయన సహచరుల మీదా రోజుకో అవినీతి ఆరోపణ బయటికి వస్తుండడంతో ఇ.డి ఆయనను వెంటాడడం ప్రారంభించింది. గిరిజనులకు సంబంధించిన భూములను ఇష్టం వచ్చినట్టు తమకు, తమవారికి బదిలీ చేయడంతో పాటు, గనుల తవ్వకం కూడా యథేచ్ఛగా సాగుతున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇ.డి ఇప్పటికే ఆయనకు ఏడుసార్లు సమన్లు జారీ చేసింది కానీ, ఆయన ఒక్కదానికి కూడా జవాబివ్వలేదు. ఇ.డి ముందు హాజరయ్యే ప్రయత్నం కూడా చేయడం లేదు. లోక్‌ సభ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగబోతున్నాయనగా ఇ.డి తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఆయన భయపడుతున్నారు. చాలా మంది నాయకుల లాగానే ఆయన కూడా ఇ.డి తీరును తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆయన రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజలకు తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ఆప్కీ సర్కార్‌, ఆప్కీ యోజన, ఆప్కీ ద్వార్‌’ (మీ ఇంటి ముందుకే ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలు) అనే నినాదంతో ఆయన ప్రజలను తనకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన తనను తాను ఇ.డి నుంచి కాపాడుకోవడం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు కానీ, ఆయన మీద ప్రాథమిక ఆధారాలు ఉండడంతో ఆయన ప్రయత్నాలేవీ ముందుకు సాగడం లేదు. ఇ.డి ఆయనకు మొదటిసారి సమన్లు జారీ చేసినప్పుడు ఆయన వాటి చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టుకు పంపించింది. గత అక్టోబర్‌ 13న హైకోర్టు ఆయన పిటిషన్‌ ను కొట్టేస్తూ, ఆయన వ్యవహారాలపై ఇ.డి తన దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. గిరిజనుల భూములను ఇతరుల పేర్ల మీద బదిలీ చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ 2020-22 సంవత్సరాల మధ్య ఆయన వేలాది ఎకరాల గిరిజన భూములను అక్రమంగా బదిలీ చేసినట్టు, వాటి క్రయ విక్రయాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఇ.డి రంగ ప్రవేశం చేయడం జరిగింది. గనుల తవ్వకానికి సంబంధించిన కేసులో మాత్రం ఆయన 2022 నవంబర్‌ నెలలో ఇ.డి ముందు హాజరయ్యారు. గనుల శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సోరేన్‌ తనకు, తన భార్యకు, తన మరదలుకు గనుల తవ్వకానికి సంబంధించిన లైసెన్సులను ఇప్పించుకుని, యథేచ్ఛగా గనుల తవ్వకాన్ని కొనసాగిస్తూ కోట్లాది రూపాయల మేరకు లబ్ధి పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆరోపణల మీద సి.బి.ఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టుకు ఒకరు పిటిషన్‌ పెట్టుకున్నారు కానీ, సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.
ఏదో ఒక సమయంలో ఇ.డి సోరేన్‌ ను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో రాష్ట్ర బీజేపీ ఆయనపై రాజకీయంగా కూడా ఒత్తిడి తీసుకువస్తోంది. ఆయన మీద ప్రాథమిక సాక్ష్యా ధారాలు లభ్యం కావడం, ఆయన వ్యవహారాల విషయంలో ఇ.డి గట్టి పట్టుదలతో వ్యవహరిస్తుండడం వగైరాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇ.డి తనను అరెస్టు చేసే పక్షంలో తన భార్య కల్పనా సోరేన్‌ను ముఖ్యమంత్రిగా కూర్చో బెట్టాలని సోరేన్‌ భావిస్తున్న విషయం అర్థం చేసుకున్న బీజేపీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే, ఆమెకు కూడా ఈ గనుల తవ్వకం కేసులో ప్రమేయం ఉన్నట్టు ఇ.డి గుర్తించడం జరిగింది. నిజానికి ఆమె ఒడిశాకు చెందిన గిరిజన మహిళ. జార్ఖండ్ లోని గత ఒకటవ తేదీన గాండీ రిజర్వుడు నియోజకవర్గానికి జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసన సభ్యుడు సర్ఫరాజ్‌ అహ్మద్‌ అకస్మాత్తుగా రాజీనామా చేయడం జరిగింది. కల్పనా సోరేన్‌ కోసమే ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందని అర్థమయి పోవడంతో బీజేపీ ఆమెపై కేసులు తేలే వరకూ ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా గవర్నర్‌ ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా శాసన సభ్యులు ఇటీవల సోరేన్‌ నివాసంలో సమావేశమై, కేసుల విషయం ఎలా ఉన్నప్పటికీ, సోరేన్‌ ను మాత్రం పదవిలో కొనసాగనివ్వాలని గవర్నర్‌ ను కోరుతూ ఒక అభ్యర్థనను పంపడం జరిగింది. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ప్రకటనలు, శపథాలు చేస్తున్న పార్టీలు సైతం సోరేన్‌పై అవినీతి ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నప్పటికీ శాయశక్తులా అడ్డుకోవడం విచిత్రంగానే ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News