Heavy Rains in North india: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లవ్ కుశ్ రెసిడెన్షియల్ పాఠశాల నీట మునిగింది. దీంతో పాఠశాలలో ఉన్న 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. తీవ్ర భయాందోళనతో వర్షంలోనే తడుస్తూ భయంతో పాఠశాల భవనంపైనే ఉండిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికుల సహాయంతో వారిని కాపాడారు.
భారీ వర్షాలతో పాఠశాల భవనం నీటిలో మునిగిపోవడంతో విద్యార్థులను ఉపాధ్యాయులు భవనం పైకి చేర్చారని అధికారులు తెలిపారు. తమకు సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు ప్రకటించి.. స్థానిక విద్యార్థులను వారి ఇళ్లకు పంపించామన్నారు. అలాగే ఇతర ప్రాంతాల విద్యార్థులను కూడా స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కారణంగా ఐలాయ్ బైండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. ఇక భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు వాయిదా వేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్రను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
