Ramdas Soren Health Condition: “జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.” శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు (Brain Clot) వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. ఈ వార్త తెలియగానే జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అసలేం జరిగిందంటే : విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శనివారం ఉదయం (ఆగస్టు 2, 2025) సుమారు 4:30 గంటల సమయంలో జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలోని బాత్రూంలో రాందాస్ సోరెన్ కాలు జారి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన తల నేలకు బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి జంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, సీటీ స్కాన్ తీసి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్యులు, తక్షణమే దిల్లీలోని ఉన్నత స్థాయి వైద్యశాలకు తరలించాలని సూచించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/170-hour-bharatanatyam-world-record-remona-pereira/
దిల్లీకి ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు : జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఈ ఘటనపై స్పందిస్తూ, “రాందాస్ సోరెన్ గారి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. బాత్రూంలో జారిపడటంతో ఆయన మెదడుకు తీవ్ర గాయమై రక్తం గడ్డకట్టింది” అని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మెరుగైన వైద్యం కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి తరలించినట్లు ఆయన ధృవీకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అన్సారీ పేర్కొన్నారు.
రాజకీయ నేపథ్యం: జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న రాందాస్ సోరెన్, ఘట్‌శిలా నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సౌమ్యుడిగా, నిరాడంబరుడిగా పేరున్న ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయనకు ప్రమాదం జరిగిందని తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ వంటి నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


