Saturday, November 15, 2025
Homeనేషనల్Jharkhand Tribe: వందేళ్ల వన యజ్ఞం.. 400 ఎకరాల అడవికి అతడే రక్షకుడు!

Jharkhand Tribe: వందేళ్ల వన యజ్ఞం.. 400 ఎకరాల అడవికి అతడే రక్షకుడు!

Tribal Forest Conservation Jharkhand: అడవిని కాపాడటానికి అటవీ శాఖ ఉంటుంది, అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. కానీ, 400 ఎకరాల దట్టమైన అరణ్యానికి ఒకే ఒక్కడు, అదీ ఎలాంటి ప్రభుత్వ జీతం తీసుకోకుండా కాపలా కాస్తున్నాడంటే నమ్మగలరా..? ఇది కథ కాదు, ఝార్ఖండ్‌లోని ముండా గిరిజన తెగ వందేళ్లుగా కొనసాగిస్తున్న అద్భుతమైన ఆచారం. ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే ఆ గిరిజనులు, అడవిని తమ తల్లిగా భావించి ఎలా కాపాడుకుంటున్నారు…? ‘బిర్ హోరోని’గా పిలవబడే ఆ అటవీ సంరక్షకుడి వెనుక ఉన్న స్ఫూర్తిదాయక గాథ ఏమిటి..?

- Advertisement -

ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా, ముర్హు బ్లాక్ పరిధిలో సుమారు 400 ఎకరాల్లో ‘బురుమా’ అడవి విస్తరించి ఉంది. ఈ అడవిని కాపాడే బాధ్యతను ఇక్కడి ‘ముండా’ గిరిజన తెగ తమ భుజస్కంధాలపై వేసుకుంది. వందేళ్లుగా కొనసాగుతున్న తమ సంప్రదాయం ప్రకారం, ప్రతి ఏటా గ్రామస్థులందరూ సమావేశమై అడవిని కాపాడటానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆయన్ని ‘బిర్ హోరోని’ అని పిలుస్తారు. స్థానిక భాషలో ‘బిర్ హోరోని’ అంటే ‘అటవీ సంరక్షకుడు’. ఆ ఏడాది మొత్తం అడవిని స్మగ్లర్ల బారి నుంచి, అక్రమ కలప నరికివేతల నుంచి కాపాడాల్సిన బాధ్యత అతనిదే.ఈ ఏడాది ఆ గౌరవం హెత్గోవా పంచాయతీలోని లోడో డిహ్ టోలి గ్రామానికి చెందిన 62 ఏళ్ల ఆంథోనీ ఒడెయాను వరించింది. జనవరిలో గ్రామ అధిపతి ఆంథోనీని ‘బిర్ హోరోని’గా నియమించారు. అప్పటి నుంచి ఆయన తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/pm-modi-emplanes-for-maldives-to-attend-independence-day-celebrations/

ఆచారం వెనుక ఆంతర్యం : వయసు పైబడినప్పటికీ, ఆంథోనీ ఒడెయాలో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆయన ముగ్గురు కుమారులు వ్యాపారం కోసం ఖుంటి పట్టణానికి వలస వెళ్లినా, ఆయన మాత్రం అడవిని, తన సంప్రదాయాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ఉదయం కాళ్లకు చెప్పులు, చేతిలో గొడుగు, ఆత్మరక్షణ కోసం ఒక ఇనుప రాడ్డు పట్టుకుని అడవిలోకి పయనమవుతాడు. వర్షం వచ్చినా, ఎండ కాసినా ఆయన విధి నిర్వహణకు ఆటంకం ఉండదు. “గతంలో ఇతర గ్రామాల ప్రజలు వచ్చి మా అడవిలో కలప నరికి తీసుకుపోయేవారు. అప్పటి నుంచి అడవిని మనమే కాపాడుకోవాలనే ఈ సంప్రదాయం మొదలైంది. ఇది దాదాపు వందేళ్లుగా కొనసాగుతోంది,” అని ఆంథోనీ ఒడెయా తెలిపారు.

జీతం కాదు… తరతరాల గౌరవం : 400 ఎకరాల అడవికి కాపలా కాస్తున్నందుకు ఆంథోనీ ఒడెయాకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా జీతంగా అందదు. బదులుగా, ఆయన సేవలకు గుర్తింపుగా, ముర్హు బ్లాక్ పరిధిలోని ముండా టోలి, ఇండల్డి, పహాన్ టోలి, లోడోడిహ్ అనే నాలుగు గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఏటా 10 గిన్నెల బియ్యం, రూ.20 నగదును గౌరవంగా అందుకుంటారు. ఇది కేవలం జీవనాధారం కాదు, వారు ఆయనకు ఇచ్చే గౌరవం. ఆ అడవిలో మామిడి, జామ, పనస, మహువా వంటి పండ్ల చెట్లతో పాటు, నెమళ్లు, పాములు, ఇతర వన్యప్రాణులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ రక్షించే బాధ్యత ఆంథోనీదే.

ALSO READ: https://teluguprabha.net/national-news/lost-mental-balance-dk-shivakumar-slams-goa-chief-minister/

“ఈసారి మామయ్య ఆంథోనీ ఒడెయాను ‘బిర్ హోరోని’గా నియమించారు. స్మగ్లర్ల నుంచి అడవిని కాపాడటంలో గ్రామం మొత్తం ఆయనకు అండగా ఉంటుంది,” అని ఆంథోనీ సోదరుడి కుమారుడు షానికా ఒడెయా తెలిపారు. గ్రామసభ అనుమతి లేకుండా ఎవరైనా కలప నరికివేస్తూ పట్టుబడితే వారికి రూ. 5000 జరిమానా విధిస్తారు. “ఇది ప్రభుత్వ సహాయం లేకుండా, మా గిరిజన స్వయం పాలన వ్యవస్థకు నిలువుటద్దం. మా అడవిని మేమే కాపాడుకుంటాం,” అని గ్రామ ముఖియా జగ్మోహన్ సింగ్ గర్వంగా చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad