Tupukhurd village has zero crime record : చిన్నచిన్న మనస్పర్థలకే కత్తులు దూసుకునే ఈ రోజుల్లో, ఒక ఊరిలో గొడవ అనే మాటే వినిపించదంటే నమ్ముతారా? కుల, మత బేధాలున్నా కలహాలకు తావే లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా! కానీ, ఇది నిజం. ఝార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామం, గత 50 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాకుండా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. క్షణికావేశాలకు, పంతాలకు పోకుండా, సోదరభావంతో సమస్యలను పరిష్కరించుకుంటూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పోలీసులే ప్రశంసించే ఆ గ్రామమేంటి? వారి ఐక్యత వెనుక ఉన్న రహస్యమేంటి? అక్కడ గొడవలు ఎందుకు జరగవు?
తుపుఖుర్ద్.. ఐకమత్యానికి చిరునామా : ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది బెండి పంచాయతీ పరిధిలోని తుపుఖుర్ద్ గ్రామం. ఇక్కడ వివిధ కులాలు, మతాలకు చెందిన సుమారు 1600 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయినా, వారి మధ్య ఎలాంటి భేదభావాలు ఉండవు. ఒకరికొకరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తారు. గత 40-50 సంవత్సరాల కాలంలో ఈ గ్రామం నుంచి ఒక్కటంటే ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదని గ్రామస్తులే గర్వంగా చెబుతున్నారు.
పంచాయతే పరమావధి.. చర్చలతోనే పరిష్కారం : ఈ గ్రామంలో గొడవలు జరగవని కాదు, కానీ ఆ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లవు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్ద వివాదం తలెత్తినా, ఊరంతా ఒకచోట కూర్చుని సామరస్యంగా, శాంతియుతంగా చర్చించుకుంటారు. పెద్దల మాటను గౌరవిస్తారు, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటారు. “సాయంత్రం అయితే చాలు, మేమంతా ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకుంటాం. అందుకే మా మధ్య గొడవలకు తావుండదు,” అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఐకమత్యమే వారి గ్రామ ప్రశాంతతకు శ్రీరామరక్ష.
పోలీసుల ప్రశంసలు : “తుపుఖుర్ద్ గ్రామస్థుల సోదరభావం ఎందరికో ఆదర్శం. నేను ఈ ప్రాంతంలో ఒకటిన్నర సంవత్సరాలకు పైగా పనిచేశాను, ఆ సమయంలో ఈ గ్రామం నుంచి ఒక్క కేసు కూడా మా స్టేషన్‌లో నమోదు కాలేదు. సానుకూల దృక్పథంతో ఉంటే ఎలాంటి జీవితాన్నైనా మెరుగుపరుచుకోవచ్చు అనడానికి ఈ గ్రామమే నిదర్శనం.”
– అరవింద్ కుమార్, లతేహార్ జిల్లా పోలీసు అధికారి
శాంతియుత పోరాటం.. అభివృద్ధి కోసం ఆరాటం : ఇంతటి ప్రశాంతతకు మారుపేరైన ఈ గ్రామాన్ని రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. ఒకటి సరైన రహదారి లేకపోవడం, మరొకటి గ్రామ మధ్యలో నుంచి వెళ్లే రైల్వే లైన్. మొదట రెండు లైన్లు ఉన్నప్పుడు రాకపోకలకు వీలుగా ఉండేదని, ఇప్పుడు మూడో లైన్ నిర్మించడంతో కనీసం సైకిల్ కూడా దాటలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వారి కష్టాలు వర్ణనాతీతం. అయినప్పటికీ, వారు తమ హక్కుల కోసం హింసా మార్గాన్ని ఎంచుకోలేదు. శాంతియుత పద్ధతిలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి శాంతియుత జీవన విధానం, వారి పోరాటంలోనూ ప్రతిబింబిస్తోంది.


